సీయం జగన్ నిర్ణయానికి బ్రేకులు… ఇక్కడ మీ ఇష్టాలు కుదరవు…

రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సుల కాల వ్యవధిని మరో ఏడాది పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జాతీయ ఉన్నత, సాంకేతిక విద్యల నియంత్రణ, పర్యవేక్షణ సంస్థలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. జాతీయ విద్యా విధానానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేశాయి. కోర్సుల కాల వ్యవధి ఎలా ఉండాలన్నది రాష్ట్రాలకు సూచిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ, ఐదేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశ పెట్టాలని భావించిన సీఎం జగన్‌ నిర్ణయానికి యూజీసీ, ఏఐసీటీఈలు బ్రేకులు వేసినట్టయింది. జాతీయ విద్యా విధానానికి లోబడి కోర్సుల కాల వ్యవధి ఉండాలని, సాధారణ కోర్సులా, ఆనర్స్‌ కోర్సులా అనే దానికి వేర్వేరు ఆప్షన్లు ఉంటాయని స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం అమలు, కొత్త నియమాలు అమల్లోకి వచ్చే వరకు రాష్ట్రంలో పాత విధానంలోనే మూడేళ్ల డిగ్రీ, నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులు అమల్లో ఉండనున్నాయి.

 

బీఎస్సీ, బీకాం, బీఏ వంటి సాధారణ కోర్సులతో పాటు ఇంజనీరింగ్‌నూ మరో ఏడాది అదనంగా చదవడం తప్పనిసరి చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబరులో సీఎం జగన్‌ స్వయంగా ప్రకటించారు. చివరి ఏడాది పూర్తిగా ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడేళ్ల వ్యఽవధితో డిగ్రీ కోర్సులను కళాశాలలు, విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి. కొన్ని కాలేజీలు మాత్రం ‘ఆనర్స్‌’ పేరిట నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. యూజీసీ కూడా దేశ వ్యాప్తంగా నాలుగు సంవత్సరాల ఆనర్స్‌ డిగ్రీ కోర్సులకు గుర్తింపు ఇస్తుంది. ఇది ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానమే. అయితే, రాష్ట్రంలో సంప్రదాయ మూడేళ్ల డిగ్రీ కోర్సులన్నింటినీ ఇకపై నాలుగేళ్ల కోర్సులుగా, నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులను ఐదేళ్ల కోర్సులుగా మార్చి అమలు చేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేయడంతో.. యూజీసీ, ఏఐసీటీఈలు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

 

రాష్ట్రంలో ఏటా 1.25లక్షల మంది విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ పూర్తి చేస్తున్నా, 5వేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారు ఖాళీగా ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలంటే చదువు పూర్తి కాగానే ఉద్యోగం లభించేలా తగిన ప్రాక్టికల్స్‌ తప్పనిసరని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలోనే మూడేళ్ల డిగ్రీ కోర్సులను ఇకపై నాలుగేళ్లకు, ఇంజనీరింగ్‌ కోర్సులను ఐదేళ్లకు మార్చాలని భావించింది. ఈ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అనుమతి కోరుతూ యూజీసీ, ఏఐసీటీఈలకు ఉన్నత విద్యామండలి లేఖ రాసింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన మండలి అధికారులకు యూజీసీ, ఏఐసీటీఈ ఉన్నతాధికారులు ఆయా కోర్సుల్లో ఎలాంటి మార్పులూ చేయడానికి వీల్లేదని, మీ ఇష్టం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న విధానమే కొనసాగనుంది.

"
"