జగన్ సూపర్ ప్లానింగ్… మార్చి అదే పథకాలు రీపిట్….మండిపడుతున్న ప్రజలు…

కొత్త పథకం ప్రవేశ పెడితే… అదే తరహాలో ఉన్న పాత దానికంటే మెరుగ్గా ఉండాలి! మరి కొందరికి, మరింత మొత్తంలో లబ్ధి చేకూరాలి. కానీ… పాత పథకాలను కలిపేసి, కలగాపులగం చేసి, మసిపూసి మారేడుకాయ చేసి కొత్తగా ఓ పేరు పెట్టేసి… అదనంగా జరిగే కొంత లబ్ధికి ఎంతోమందిని దూరం చేస్తే? దానిని దగా… అనే అంటారు! అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన విషయంలో జరుగుతున్నది ఇదే! ఒక్కసారిగా పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చేసి…. భ్రమల్లో ముంచేసి… ప్రతినెలా పద్ధతిగా వాడుకునేందుకు ఉద్దేశించిన పథకాలను రద్దు చేశారు. ఈ పథకాలు లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారాయి. ఆరు నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులకు అర్హతను బట్టి… స్కాలర్‌షిప్‌, కాస్మెటిక్‌ చార్జీలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఇలా పలు పథకాలు వర్తించేవి. ఇప్పుడు వాటినే గజిబిజిగా మార్చి, గందరగోళపరిచి… అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెనగా అమలు చేస్తున్నారు. అప్పుడు… ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులున్నా, అందరికీ ఆయా పథకాలు వర్తించేవి. ఇప్పుడు… విద్యార్థులను కాదని, తల్లిని లబ్ధిదారుగా మార్చడంలోనే పెద్ద మాయ, మోసం దాగి ఉంది. ‘‘పిల్లల చదువులకు ఫీజు ఎంతైనా ఇస్తాం. హాస్టల్‌, మెస్‌ ఖర్చులకు రూ.20 వేలు ఇస్తాం’ అని ఎంతో గొప్పగా ప్రకటిస్తున్న ప్రభుత్వం… షరతులు, ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్యకు భారీగా కోత పెట్టేసింది..

 

గత ప్రభుత్వ హయాంలో ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఏటా 4విడతల్లో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ చేసే వాళ్లు. ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే విద్యార్థులకు క్రమం తప్పకుండా స్కాలర్‌షి్‌పలు లభించేవి. ఎంటీఎఫ్‌ నెల వారీగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు, ఆర్‌టీఎఫ్‌ సొమ్ము కాలేజీల ఖాతాలకు జమయ్యేది. ఇప్పుడు… అమ్మ ఒడి ఇస్తున్నారంటూ ఇంటర్‌ విద్యార్థులకు ఆర్టీఎ్‌ఫను ఎత్తేశారు. విద్యా దీవెన కింద ఇచ్చే ఫీజును ఇంకా నిర్ణయించనే లేదు.గతంలో 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఏడాదిలో పది నెలల పాటు ప్రతినెలా రూ.750 స్కాలర్‌షిప్‌ వచ్చేది. 8-9 తరగతుల విద్యార్థులకు రూ.850, 10వ తరగతి విద్యార్థులకు రూ.950 చొప్పున అందేది.  సగటున ఒక్కో  విద్యార్థికి సంవత్సరానికి రూ.14 వేలను విడతల వారీగా చెల్లించేవారు. అందులోనూ… ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే, అందరికీ డబ్బులు అందేవి. ఉదాహరణకు… ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉండి ఒకరు 6వ తరగతి, మరొకరు 8వ తరగతి, ఇంకొకరు పదో తరగతి చదువుతుంటే… ముగ్గురికీ కలిపి 25,500 వచ్చేవి. ఇప్పుడు… అదే కుటుంబానికి ‘అమ్మ ఒడి’ కింద అందేది 15వేలు మాత్రమే! ఇంట్లో ఎందరు చదువుకుంటున్నా, తల్లికి మాత్రమే రూ.15 వేలు జమ చేయడమే దీనికి కారణం. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ అందరినీ ‘అమ్మ ఒడి’ని వర్తింపచేస్తున్నారు. పరిధి విస్తరింపచేసినప్పటికీ… తల్లులను ప్రాతిపదికగా చేసుకోవడంతో లబ్ధిదారుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఒక్కో కుటుంబానికి జరిగే లబ్ధికీ కోత పడింది.ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌కే ‘జగనన్న విద్యా దీవెన’ అని పేరు పెట్టారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ… ఇంత వరకు ట్యూషన్‌ ఫీజులను తేల్చలేదు. పెండింగ్‌ బకాయిలు దాదాపు రూ.4 వేల కోట్ల వరకు చేరాయి. వాటి గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాలేజీ ఫీజులకు భారీగా కోత విధించేలా కసరత్తు జరుగుతోంది.విద్యార్థుల కోసం వైసీపీ సర్కారు అమలు చేస్తున్న మరో పథకం… ‘జగనన్న వసతి దీవెన’! దీని కింద వసతి గృహాల్లో ఉండి చదువుకునే ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ చదివే వారికి రూ.15 వేలు, డిగ్రీ/పీజీ విద్యార్థులకు రూ.20 వేలు చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని కూడా తల్లుల ఖాతాలోనే జమ చేస్తారు.

 

అయితే, ఎంతమంది చదువుతుంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఏటా ఫిబ్రవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి రెండు విడతల్లో సొమ్ము చెల్లిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ మొత్తాన్ని విద్యార్థులకే ప్రతి నెలా ఇచ్చే వారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.14వేలు చెల్లించేవారు. వారి నుంచి కాలేజీలు మెస్‌ చార్జీలుగా వసూలు చేసుకునేవి. అప్పట్లో 16 లక్షల మంది పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు సహాయం అందేది. ఇప్పుడు… ఆ సంఖ్య ఏకంగా 11 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో… ఇస్తున్న సహాయాన్ని కూడా మూడు కేటగిరీలుగా విభజించి… 10వేలు, 15వేలు, 20 వేలుగా నిర్ణయించారు. కాస్మెటిక్‌ చార్జీలను ఎత్తివేశారు. ఈ మొత్తాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లో వేయడంతో కాలేజీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటి వరకు తాము పెట్టిన ఖర్చులను చెల్లించేదెవరని ప్రశ్నిస్తున్నాయి. విచిత్రం ఏమంటే .. 2019-20లో తొలి విడత కింద ఫిబ్రవరిలో సగం సొమ్ము విడుదల చేసి, మిగిలిన మొత్తాన్ని జూలైలో ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇప్పుడు ఫైనల్‌ ఇయర్‌ డిగ్రీ లేదా పీజీ చదువుకునే విద్యార్థులకు రెండో దఫా సొమ్ము వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించడంపై సందేహాలు కలుగుతున్నాయి.

"
"