జైలుకెళ్ళి నేర్చుకున్నావా జగన్.. పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీలో కొద్ది రోజులుగా  జనసెన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వైఎస్ జగన్ పై మరోకసారి విరుచుకుపడ్డాడు. ‘‘ఇంగ్లీషు మీడియంలో చదివితేనే జీవితాలు మారిపోతాయనుకుంటే, అదే మీడియంలో చదివినవారు జైలుకు ఎందుకు వెళతారు? అంటే జైలు కెళ్లడం ఇంగ్లీషు నేర్పిందా?’’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘‘మన రాష్ట్రంలో 64,630 ప్రభుత్వపాఠశాలలు ఉండి, ఎనిమిది భాషామాధ్యమాలలో బోధన జరుగుతుంటే కేవలం తెలుగు మీదే ఎందుకు పడ్డారని, మాతృభాషనే ఎందుకు చంపాలని కంకణం కట్టుకున్నారని ప్రశ్నించారు.

‘‘భాషల జోలికి రాకండి. లేదంటే సరస్వతి.. అపర దుర్గగా మారి సమూలంగా నాశనం చేస్తుంది’’ అని ప్రభుత్వాన్ని తీవ్రస్వరంతో హెచ్చరించారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సోమవారం తిరుపతిలో ‘మన నుడి- మన నది’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ‘తెలుగు వైభవం’ పేరిట సాహితీవేత్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కవులు, రచయితలు ఆలపించిన తెలుగు పద్యాలకు పవన్‌ పరవశించిపోయారు. ఈ సందర్భంగానూ, పార్టీ నేతలతో జరిపిన సమావేశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం, జగన్‌పై విరుచుకుపడ్డారు. మాతృభాష పట్ల తనకున్న మక్కువను మరోసారి చాటుకొన్నారు. ‘‘నాకు తెలియని, నా మాతృభాష కాని ఇంగ్లీషు వల్లనే తెలుగు తాలూకూ అందాన్ని, ధ్వనిని ఆనందించలేకపోయాను. చిన్న వీధిబడిలో చదువుకున్న నన్ను ప్రాథమిక విద్య అనంతరం ఇంగ్లీషు మీడియంలో చేర్పించారు. దీంతో చదువంటేనే ఒక రకమైన విరక్తి, భయం వచ్చేశాయి’’ అని తెలిపారు. చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి గానీ, భయాన్ని కాదన్నారు. ‘‘మేడసాని మోహన్‌ అవధానం చేస్తుంటే వినే శక్తి నాకు లేదు. రాయలవారి ఆముక్తమాల్యదను అర్థం చేసుకునే శక్తిలేకుండా పోయింది.

షేక్‌స్పియర్‌ గురించే ఎందుకు చదువుకోవాలి? తిక్కన, నన్నయ ఉన్నారు కదా!’’ అని పేర్కొన్నారు.దశాబ్దాలుగా పాలకులకు తెలుగును పరిరక్షించేందుకు శక్తిలేనప్పుడు కొత్తగా ఏమి చేస్తారని పవన్‌ ప్రశ్నించారు. తమ బిడ్డలను ఏ మాధ్యమంలో చదివించాలనేది వారి తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేయాలని పవన్‌ సూచించారు.