జగన్ కు కేంద్రం ఘోర అవమానం…

భారత పర్యటనకొస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి ఇవ్వనున్న విందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆహ్వానం అందలేదు. ఈ నెల 25వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ విందుకు హాజరుకావాలని ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందిన ఆహ్వానంలో జగన్‌కు చోటు దక్కలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రపతి భవన్‌ నుంచి వర్తమానం అందింది. పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుకూలతను ప్రదర్శిస్తున్న జగన్‌కు మాత్రం ఈ అవకాశం లభించలేదు.జగన్‌ కొద్దిరోజుల కిందటే ఢిల్లీ వెళ్లి మోదీ-షాలతో చర్చలు జరిపి వచ్చిన విషయం తెలిసిందే.కాగా, రాష్ట్రపతి ఇవ్వనున్న ఈ విందుకు దేశ వ్యాప్తంగా 90 నుంచి 95 మందికే ఆహ్వానాలు అందినట్లు తెలిసింది.

 

కేసీఆర్‌తో పాటు అసోం, హరియాణా, కర్ణాటక, బిహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా సీఎంలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ఈ ఎనిమిది మందిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వీరిలో విపక్ష- పాలిత రాష్ట్రాల సీఎంలెవరూ లేరు. అసోం, హరియాణా, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. బిహార్‌, తమిళనాడు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, అన్నాడీఎంకేల ఏలుబడిలో ఉన్నాయి. అందునా బిహార్‌లో బీజేపీ కూడా ఓ భాగస్వామ్య పక్షం. ఇక మహారాష్ట్రలో ఒకప్పటి బీజేపీ మిత్రపక్షం, నేటికీ ఆ బంధాన్ని పూర్తిగా తెంపుకోలేక ఊగిసలాడుతున్న శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఉంది.ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కేవలం రెండురోజుల కిందటే కుమారుడితో మోదీని కలిసి ఆంతరంగిక చర్చలు జరిపి వచ్చారు. ఇక ఒడిసాలోని అధికార బీజేడీ… పూర్తి తటస్థ పక్షం. ఎక్కువగా మోదీ-అనుకూలతను ప్రదర్శిస్తుండే నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలో ఉన్న రాష్ట్రమది. ట్రంప్‌ తొలి మజిలీ గుజరాత్‌ కాబట్టి అక్కడి సీఎం విజయ్‌ రూపానీని ఈ జాబితానుంచి మినహాయించారు.

 

ట్రంప్‌ తాజ్‌మహల్‌ సందర్శనకు వెళుతున్నారు కాబట్టి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ఆహ్వానించలేదు. ఇదిలాఉండగా, ఈ విందుకు పార్లమెంట్‌ ఉభయసభల్లో కాంగ్రెస్‌ పక్ష నేతలైన అధీర్‌ రంజన్‌ చౌధురీ, గులాంనబీ ఆజాద్‌లను రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే తమ పార్టీ అధ్యక్షురాలైన సోనియాగాంధీని పిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అధీర్‌ రంజన్‌ – విందుకు తాను హాజరుకానని ప్రకటించారు.

"
"