జగన్ కు దెబ్బ పడింది… తేరుకోవడం కష్టం..

తప్పు అని తెలిసీ ముందుకెళ్లడం, ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టినా మొండిగా సుప్రీంకోర్టుకు వెళ్లడం… అక్కడ మొట్టికాయలు తినడం! హైకోర్టులోనూ వరుసగా ఎదురు దెబ్బలు! సోమవారం ఏకంగా నాలుగు అంశాలపై న్యాయస్థానాలు తప్పుపట్టడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఎదురుదెబ్బల్లో ముఖ్యమంత్రికి సన్నిహితంగా పనిచేసే సీనియర్‌ అధికారులకూ బాధ్యత ఉన్నట్లే! ‘నేను చెప్పింది జరగాల్సిందే’ అని సీఎం జగన్‌ పేర్కొంటుండగా… ‘మీ మాటే శాసనం’ అంటూ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ముందూ వెనుకా చూడకుండా ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనకున్న భావోద్వేగాలు, రాజకీయ అవసరాలు, సొంత ఆలోచనల మేరకు ప్రకటనలు చేయడం సహజం. కానీ… వాటిపై ఉత్తర్వులిచ్చి అమల్లోకి తీసుకొచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది అధికారులే.

 

కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు… తాన అంటే తందానా అన్నట్లుగా తయారుకావడంవల్లే ఈ దుస్థితి వచ్చిందనే అభిప్రాయం నెలకొంది. ఉదాహరణకు… గ్రామ, వార్డు సచివాలయాలకు అచ్చంగా వైసీపీ జెండాలోని రంగులను వేయాలని జగన్‌ నిర్ణయించగానే, సంబంధిత అధికారులు ఎంచక్కా ‘నమూనా’ చిత్రంతో కూడిన జీవో జారీ చేసేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు పులమడం నిబంధనలకు విరుద్ధమని, ఎవరు కోర్టుకు వెళ్లినా ఎదురుదెబ్బ తప్పదని తెలిసినా పట్టించుకోలేదు. హైకోర్టు గట్టిగా అక్షింతలు వేసిన తర్వాతైనా తప్పుదిద్దుకోకుండా… సుప్రీంకోర్టుకు వెళ్లారు. చివరికి, అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో… అధికారులు జగన్‌కు సలహాలు ఇచ్చేందుకు సాహసించడం లేదా? ఒకవేళ, చెప్పినా ఆయన పట్టించుకోవడంలేదా? అనే చర్చ జరుగుతోంది.‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గంభీరమైన ప్రకటనలు చేస్తుంటారు. సంచలన నిర్ణయాలూ వెలువరిస్తుంటారు. అయితే, వాటిని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత విభాగాల కార్యదర్శులు పరిశీలించి నిబంధనల ప్రకారమే ఉత్తర్వులిస్తున్నారు. అందువల్ల, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగలడంలేదు’’ అని ఒక అధికారి విశ్లేషించారు. సీఎం ప్రకటనలపై లిఖిత పూర్వక ఉత్తర్వులివ్వాల్సింది ప్రధాన కార్యదర్శి, సంబంధిత కార్యదర్శులే. భవిష్యత్తులో ఏదైనా తేడా వస్తే బాధ్యత వహించాల్సింది వీరే. ‘‘ఆ బాధ్యతతో అధికారులు తమ పని తాము చేయాలి. అప్పటికీ సీఎం వినకుంటే… నోట్‌ఫైల్‌ మీదతమ అభిప్రాయం రాయాలి.లేకుంటే చిక్కులు, కోర్టుల్లో చీవాట్లు తప్పవు’’అని ఓఅధికారి వెల్లడించారు.

 

తెలుగు మీడియం రద్దు, ఎస్సీ-ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు, ఆ తర్వాత… మూడు రాజధానుల బిల్లు! ఇలా తమ నిర్ణయాలను అడ్డుకుంటోందంటూ… శాసన మండలినే రద్దు చేయాలని సర్కారు భావించింది. హుటాహుటిన అసెంబ్లీలో తీర్మానం చేసి… కేంద్రానికి పంపించారు. వీలైనంత త్వరగా దీనిపై పార్లమెంటు ఆమోద ముద్ర పొంది… మండలిని అటకెక్కించాలనుకున్నారు. కానీ… పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై కనీస ప్రస్తావన కూడా రాలేదు. కరోనా విజృంభణ నేపథ్యంలో సోమవారం లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. మళ్లీ… వర్షాకాల సమావేశాల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. వెరసి… మండలిని అటకెక్కించాలన్న సీఎం జగన్‌ పట్టుదల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడంలేదు.

"
"