జగన్ కు కొత్త చిక్కు.. చంద్రబాబు వ్యూహం ఫలించేనా..?

వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చి  ఆరు నెలలు పూర్తయ్యింది. ఇక సీయం అయినప్పటి నుండి అయన సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వేళ్తున్న విషయం తేలిసిందే.ఏపీలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని ప్రజలను అడిగితే… చాలా మంది బాగానే ఉంది అంటున్నారు. కొందరేమో ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. ఇంకొందరు… పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. మరికొందరు… కొత్త పరిశ్రమలు వచ్చేందుకు జగన్ సర్కార్ ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని అంటున్నారు. కొంతమందేమో… ఇచ్చిన మాట, చెప్పినది చెప్పినట్లుగానే చేస్తున్నారు కదా అంటున్నారు. ఇంకొందరు… ఆరు నెలలేగా అయ్యింది మరికొంత టైమ్ పడుతుంది కంగారెందుకు అని ప్రతిపక్షాలపై మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం అరాచకపాలన అనీ, హింస రాజ్యమేలుతోందని రకరకాలుగా విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా 2023 లేదా 2024లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనీ… జగన్‌ను ఒంటరి చేసి… అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాయన్న వాదన ఏపీలో బలంగా వినిపిస్తోంది.

ఈ ప్లాన్‌లో భాగంగానే… వైసీపీ సర్కారుకు ఆరు నెలల కాలం పూర్తవగానే… టీడీపీ, బీజేపీ, జనసేన విమర్శలతో విరుచుకుపడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. సమస్యేంటంటే… జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీ పరిస్థితేమీ అద్భుతంగా లేదు.అన్నీ అప్పులేగా. ఆరు నెలల తర్వాత కూడా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. అవే అప్పులు, అవే సమస్యలు. అద్భుతాలు జరుగుతాయని ఆశించే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మొత్తం ప్రభుత్వం ఇచ్చే పథకాలు, సబ్సిడీలు, రాయితీలు, వెసులుబాట్లకే సరిపోతోంది. వాటన్నింటికీ సర్దుబాటు చెయ్యడంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సి వస్తోంది. అందువల్ల ప్రభుత్వం సెట్ అయ్యి… ఆదాయం పెంచేందుకు ప్రయత్నించడానికి మరికొంత సమయం ఇవ్వడం మంచిదంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్షాలు మాత్రం… ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వం అసమర్థత బయటపడిపోయిందని విమర్శిస్తున్నాయి.ప్రధానంగా ఇసుక కొరత, రాజధాని అంశాన్ని లేవనెత్తుతూ… టీడీపీ ఆందోళనలు, ర్యాలీలు చేస్తోంది. తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందంటూ… జనసేన విరుచుకుపడుతోంది. ఇక తెరవెనక మంతనాలు చేస్తున్న బీజేపీ… పరోక్షంగా టీడీపీకి సహకరిస్తోందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ దన్నుతోనే టీడీపీలో ఈ కొత్త జోష్ కనిపిస్తోందన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వానికి మరో 6 నెలలు టైమ్ ఇస్తే తప్ప… జగన్ పాలన జనరంజకంగా ఉందా లేదా అనేది తేలుతుందంటున్నారు. ఈలోపే రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీకి పూర్తి మెజార్టీ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకంటే… మరో నాలుగున్నర ఏళ్లపాటూ ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేసే అవకాశాలు లేవంటున్నారు. అందువల్ల స్థానిక పోరుపై వైసీపీకి పెద్దగా టెన్షన్ ఉండదన్న వాదన వినిపిస్తోంది.ఇప్పటివరకూ జగన్ నవరత్నాలపై ఫోకస్ పెడుతూనే… మరోవైపు… గత టీడీపీ పాలనలో లోపాల్ని బయటకు లాగుతున్నారు.

ఇది తమకు ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్న టీడీపీ… తనే స్వయంగా వైసీపీపై ఆందోళనలు చేయడం ద్వారా… సర్కారుకు టెన్షన్ తెప్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఐతే… ఈ ఆందోళనలు ప్రభుత్వంపై ఎంతవరకూ ప్రభావం చూపిస్తాయన్నది తేలల్సిన అంశం. బీజేపీ అండతో… జగన్‌పై ఉన్న కేసుల్ని తిరిగి తోడటం ద్వారా… వైసీపీ సర్కారును గద్దె దింపాలన్నది టీడీపీ వ్యూహంగా తెలుస్తున్నా… అది సక్సెస్ అవ్వడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే అలాంటి చర్యలకు పాల్పడితే… ప్రజలు మరోసారి వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు. ఇలా మలుపులు తిరుగుతున్న ఏపీ రాజకీయాలు… జగన్ పాలనకు ఆరు నెలలు గడవటంతో… వింటర్‌లోనూ హీట్ పుట్టిస్తున్నాయి.