జగన్ నిర్ణయం, టీడీపీకి కలిసి వస్తుందా..?

ప్రస్తూతం జగన్  తీసుకుంటున్న నిర్ణయం ఎపీకి బాగా కలిసివస్తున్నాయని అందరూ అంటున్నారు. ఏపీలో గత టేడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై వైసీపీ సర్కారు వరుసగా దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేస్తోంది. వీటిలో ఏ ఒక్కటి రుజువైనా అప్పట్లో సీఎంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం జైలుకు వెళ్లక తప్పదు. ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీ ఏం చేయబోతోందనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. 2014లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసి విజయం సాధించిన టీడీపీ ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం నేపథ్యంలో 2018లో ఎన్డీయేకు గుడ్ బై చెప్పేసింది. అంతటితో ఆగకుండా బీజేపీపై ధర్మపోరాటం పేరుతో పెద్ద పోరాటమే చేసింది.ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను సైతం టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశం ఉన్నందున బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని దేశవ్యాప్తంగా 22 పార్టీలను కూడగట్టిన అప్పటి సీఎం చంద్రబాబు.. ఓ దశలో బీజేపీకి కంట్లో నలుసులా మారిపోయారు.

 

చివరికి 2019 సార్వత్రిక ఎన్నికలు జరగడం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రజలు అఖండ మెజారిటీని కట్టబెట్టడం, చంద్రబాబుతో పాటు టీడీపీతో జట్టు కట్టిన పార్టీలన్నీ దారుణంగా ఓటమి పాలవ్వడం చకచకా జరిగిపోయాయి.సీన్ కట్ చేస్తే ఎన్నికలు ముగిశాక ఎన్డీయే నుంచి బయటికి రావడం, ఆ తర్వాత బీజేపీ పెద్దలపై ధర్మపోరాటం చేయడం తాను చేసిన తప్పిదమేనంటూ విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి బీజేపీతో జట్టు కట్టేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. అయినా చంద్రబాబును కాదని జనసేనతో జట్టు కట్టిన బీజేపీ.. టీడీపీతో భవిష్యత్తులోనూ పొత్తు ఉండబోదని తేల్చేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐటీ విభాగం చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ తో పాటు ఇతర టీడీపీ నేతల ఇళ్లపైనా భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది.ఇందులో దాదాపు 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దొరికినట్లు ఐటీ అధికారులు స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత ఐటీ పంచనామా నివేదికలు బయటపడటం, టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర మాటలయుద్దం చోటుచేసుకోవడం కూడా జరిగింది. మరోవైపు టీడీపీ నేతలను ఇరికించేందుకు ఎదురుచూస్తున్న వైసీపీ పెద్దలు కూడా గత ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలను తేల్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా సిట్‌ను ఏకంగా పోలీసు స్టేషన్‌గా ప్రకటించడంతో పాటు రాష్ట్రం మొత్తాన్ని దాని పరిధిలోకి తెచ్చేశారు. అంతే కాదు సిట్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ అధికారాలు కూడా కట్టబెట్టారు.రాష్ట్రంలో ఎవరినైనా తమ వద్దకు పిలిపించుకుని విచారించడం, అరెస్టు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి అధికారాలను సిట్‌కు అప్పగించారు. దీంతో సిట్ తన విచారణలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యులను విచారణకు పిలిపించడం, అవసరమైతే అరెస్టులు కూడా చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

 

దీంతో చంద్రబాబుకు మరోసారి బీజేపీని ఆశ్రయించక తప్పని పరిస్ధితి నెలకొంది. వాస్తవానికి చంద్రబాబు బీజేపీని ఆశ్రయిస్తే వైసీపీకే నష్టం కలుగుతుంది. అదే జరిగితే గతంలోలా టీడీపీని టార్గెట్ చేయడం, ఆ పార్టీ నేతలను అరెస్టు చేయడం కుదరదు. అయినా వైసీపీ జోరు చూస్తుంటే చంద్రబాబును ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది. దీంతో జగన్ టీడీపీని అనివార్యంగా బీజేపీకి దగ్గర చేస్తున్నారా, లేక మరో అడుగు ముందుకేసి బీజేపీలో టీడీపీని విలీనం దిశగా అడుగులేయిస్తున్నారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సిట్ విచారణ జరిగే తీరు ఆధారంగా టీడీపీ భవిష్యత్తు అడుగులు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

"
"