ఎంపీ సీటు ఆఫర్ తో మరో ఎమ్మెల్యేకు వైసీపీ గాలం… ఆందోళనలో టీడీపీ

అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లిపోతూ పేల్చిన బాంబు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో అలజడి రేపుతోంది. ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కాసింత ఆందోళనకరమైన పరిస్థితులు సృష్టించాయి. కాపు నాయకులంతా వైసీపీలో చేరుతారనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ వర్గం నాయకులను ఆత్మసంరక్షణలో పడేశాయి. కొందరు ఇదే అదనుగా భావించి వ్యూహాత్మకంగా తెలుగుదేశాన్ని బలహీనపరచడానికి పుకార్లు ప్రచారం చేస్తున్నారు. జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు వైసీపీలో చేరడానికి సిద్ధంగా వున్నారనేది ఒక పుకారు.

ఇదే విషయాన్ని కొన్ని పత్రికలు కూడా ప్రస్తావించడంతో పంచకర్ల శుక్రవారం స్వయంగా ఖండన పంపించాల్సి వచ్చింది. తాను తెలుగుదేశంలోనే వుంటానని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, తనకు ప్రతి ఎన్నికకు పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఇదిలావుంటే రూరల్‌లోని ఒక ముఖ్య నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యాపార భాగస్వామి, ప్రతిపక్ష పార్టీలో కీలక స్థానంలో వున్న పొరుగు జిల్లా నేత ఎప్పటి నుంచో సదరు ఎమ్మెల్యేను పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారని సమాచారం. అయితే ఎంపీగా, లేదంటే సిట్టింగ్‌ స్థానం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై సదరు నాయకుడు తర్జనభర్జన పడుతున్నాడంటున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ టిక్కెట్‌కు టీడీపీ అభ్యర్థిగా కొన్నాళ్లుగా ఒక సీనియర్‌ నాయకుడి పేరు (ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు) వినిపిస్తూ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ ఏ విషయం స్పష్టంగా చెప్పకపోవడంతో ఆయన ఊగిసలాటలో వున్నారని…ఇదే సమయంలో వైసీపీ నేతలు మళ్లీ మంతనాలు మొదలెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు గత ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు అప్పగిస్తే సరైన ఫలితాలు చూపించలేదనే అభిప్రాయం వైసీపీ అధినేత జగన్‌కు ఉందంటున్నారు. కానీ ఇది ఎన్నికల సమయం కాబట్టి అలాంటివి ఏమీ పెట్టుకోకుండా సీనియర్లను వస్తామన్నప్పుడు తీసుకోవడం మంచిదని ఆయనకు కొందరు సర్దిచెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఎక్కడ చూసినా జిల్లాలో ప్రస్తుత రాజకీయ అంశాలపైనే చర్చలు జరుగుతున్నాయి.

ఊపిరున్నంత వరకు టీడీపీలోనే ఉంటా: ’పేట’ ఎమ్మెల్యే వి.అనిత
పాయకరావుపేట, ఫిబ్రవరి 15: ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తనను పార్టీలోకి ఆహ్వానించి, ఎమ్మెల్యేను చేసిన తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని, ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే వుంటానని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత స్పష్టంచేశారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాను వైసీపీలో చేరుతున్నట్టు కొన్ని ప్రసార మాధ్యమాల్లో రావడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని, వైసీపీ నాయకులు ఆడుతున్న మైండ్‌ గేమ్‌ అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, గత 36 సంవత్సరాల్లో ఎంతోమంది పార్టీలోకి వచ్చారని, వారిలో కొంతమంది వెళ్లిపోయారన్నారు. ఇటువంటి వారిలో పలువురు తమ తప్పు తెలుసుకుని తిరిగి పార్టీలోకి వచ్చారన్నారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో భీమిలి టిక్కెట్‌ ఆశించారని, పార్టీ అధిష్ఠానం వీలు కాదన్నందుకు బయటకు వెళ్లి అధినేత చంద్రబాబును అడ్డగోలుగా విమర్శించడం సరికాదన్నారు. టీడీపీతోనే కాపులకు న్యాయం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చిన తెలుగుదేశం పార్టీ అనే కుటుంబాన్ని వీడేది లేదని ఆమె స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు యాళ్ల వరహాలబాబు, బోయిడి శ్రీనివాసరావు, నీలాపు మహేష్‌రెడ్డి, కంకిపాటి వెంకటేశ్వరరావు, రావాడ గోవిందరెడ్డి, కట్టా శ్రీను, గీసాల పద్మావతి, ఎం.రమాకుమారి, వేములపూడి అప్పారావు, ఆది తదితరులు పాల్గొన్నారు.