వైసీపీ అంచనాలు తలక్రిందులు… ఆ రెండు చోట్ల మెజారిటీనే టీడీపీని గెలిపించింది

తెలుగుదేశం పార్టీ గెలుపునకు రేపల్లె, రేపల్లె రూరల్‌లో భారీ మెజార్టీ రావటంతో సునాయాసంగా అనగాని గెలిచారు. రేపల్లెలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ తగ్గించేందుకు వైసీపీ నాయకులు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అభివృద్ధి చేయటం, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం కావటంతోనే అనగానికి రేపల్లె మండలం అండగా నిలిచింది. కాపు సామాజికవర్గానికి టీడీపీ హయాంలోనే అభివృద్ధి చేయటం, అనగాని వారికి అండగా ఉండటంతో ఓట్ల రూపంలో ఆయన విజయానికి దోహద పడ్డారు.

రేపల్లె మండలంలో వైసీపీకి పట్టు ఉన్న లంకె వానిదిబ్బ, మోళ్లగుంట, లక్ష్మీపురం, అడవిపాలెం గ్రామాల్లో కూడా తెలుగుదేశం వైపే మత్స్యకారులు అండగా నిలిచారు. రేపల్లె మండలంలో 83,932 ఓట్లు ఉండగా, 67762 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 34257 ఓట్లు, వైసీపీకి 25719, జనసేనకు 5663, ఇతరులు 2123 పోలవ్వగా రేపల్లె పట్టణ, రూరల్‌ కలిపి 8538 మెజార్టీ టీడీపీ సాధించింది. నగరం మండలంలో 41381 ఓట్లు ఉండగా, 35556 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 19288, వైసీపీకి 13485, జనసేనకు 1785, ఇతరులకు 998 రాగా, టీడీపీకి 5803 మెజార్టీతో నిలవటంతో ఈ రెండు మండలాలే టీడీపీ గెలుపునకు కీలకంగా మారాయి. రేపల్లె రూరల్‌, పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు వైసీపీలో చేరటంతో ఆ ప్రాంతంలో టీడీపీకి మెజార్టీ తగ్గుతుందని, వైసీపీదే గెలుపు అంటూ ఫలితాల ముందు వరకు ఆ పార్టీ నాయకులు ధీమాను వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చిన అనంతరం రేపల్లె పట్టణ, మండలంలో దేవినేని ప్రభావం కనబడకపోగా టీడీపీకి గతం కంటే ఇప్పుడు 2500 మెజార్టీ పెరిగింది. వైసీపీకి పట్టు కొమ్మలయిన నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో అనగాని సత్యప్రసాద్‌ ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం తీవ్ర కృషి చేయటంతో మెజార్గీ తగ్గించగలిగారు. ప్రజలకు అండగా ఉండి వారికి సేవలందించటంలో రెండు మండలాల ప్రజలు కూడా అనగానికి అండగా నిలిచారు దీంతో తెలుగుదేశం పార్టీ బలపటంతో పాటు వైసీపీకి రెండు మండలాల్లో ఆశించినంత ఆధిక్యత రాలేదు. నిజాంపట్నం మండలంలో 48843 ఓట్లు ఉండగా, 39779 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 17274, వైసీపీకి 19669, జనసేనకు 1497, ఇతరులకు 1339 ఓట్లు వచ్చాయి. వైసీపీ 2395 ఓట్ల మెజార్టీ సాధించింది.

వైసీపీ నాయకులు మాత్రం నిజాంపట్నంలో 5వేల నుంచి 6వేల వరకు వస్తాయని అంచనాలు వేశారు. అయితే, 2395 మాత్రమే మెజార్టీ రావటంతో ఊహించని పరిణామాన్ని చవిచూశారు.చెరుకుపల్లి మండలంలో 47931 ఓట్లు ఉండగా, 40863 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 18192, వైసీపీకి 18557, జనసేనకు 2669, ఇతరులకు 1445 ఓట్లు లభించాయి. 365 ఓట్లు వైసీపీకి స్వల్పంగా మెజార్టీ వచ్చింది. చెరుకుపల్లి మండలంలో వైసీపీకి నాలుగు వేల మెజార్టీ వస్తుందనుకుంటే కేవలం 365 ఓట్లు రావటంతో వైసీపీ ఓటమికి కారణమయ్యాయి.