యలమంచిలికి షాకిచ్చిన జగన్…! ఈసారి టిక్కెట్ లేనట్లే..!

విజయవాడ తూర్పు టిక్కెట్‌పై వైసీపీలో సిగపట్లు మొదలయ్యాయి. తూర్పు టిక్కెట్‌ తమదంటే తమదేనంటూ బొప్పన భవకుమార్.. యలమంచిలి వర్గాలు కుస్తీపట్లు పడుతున్నాయి. జగన్ తనకు సమాచారం ఇచ్చాడని బొప్పన భవకుమార్ ప్రచారం ప్రారంభించారు. గురువారం విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. తూర్పు నియోజకవర్గంలోని కరెన్సీనగర్‌ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఈ నెల 16న విజయ వాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌తో కలిసి ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించారు.

మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో టికెట్‌ తమదేనని, 16న వైసీపీ అధినేత విడుదల చేయనున్న తొలి జాబితాలో యలమంచిలి రవి పేరు ఉంటుందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. దీంతో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.యలమంచిలి రవి గత ఏడాది వరకు టీడీపీలో ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో జగన్‌ పాదయాత్ర విజయవాడలో జరుగుతున్న సమయంలో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వంగవీటి రాధాకృష్ణ ఆయనను పార్టీలో చేర్చారు. అయితే పీవీపీ వైసీపీలో చేరికతో తూర్పు టిక్కెట్‌ టెన్షన్‌ నెలకొంది. బొప్పన భవకుమార్‌కు ఇవ్వాలని పీవీపీ పార్టీ అధినేత జగన్‌కు సూచించడం, ఆయన పీవీపీ ప్రతిపాదనకు ఓకే చెప్పడం జరిగిపోయాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బొప్పన భవకుమార్‌ ప్రకటనతో యలమంచిలి రవి వర్గీయుల్లో ఒక్కసారిగా టెన్షన్‌ నెలకొంది.టిక్కెట్‌ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుందేనని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు తనయుడైన రవికి నియోజకవర్గంలో మంచి పేరే ఉంది.

2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. గత ఏడాది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజా పరిణామాలతో రవి రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడింది. జగన్ మోసం చేశాడని.. ఆయన మథన పడుతున్నారు. పాదయాత్ర కోసం ఆయనతో చాలా ఖర్చు పెట్టించారు. ఇప్పుడు టిక్కెట్ లేదంటున్నారు.