దెవినేని ఉమాపై కక్ష సాధింపు

‘ప్రజా ప్రయోజనాలను గాలికొదిలి.. చంద్రబాబు ఇల్లు కూల్చాలి.. ఆయన్ను జైల్లో పెట్టాలి.. దేవినేని ఉమను జైల్లో పెట్టాలన్న కక్షతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. వరద ముంపునకు గురైన కృష్ణాజిల్లా కాసరనేనివారిపాలెంలో ఆదివారం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంత భారీ వరద వస్తున్నప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ఒక్క సమీక్షా సమావేశం అయినా ఏర్పాటు చేశారా? గోదావరి జిల్లాల్లో వరద సమయంలో ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించారు.

ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలతో అతలాకుతలమవుతున్న ప్రజలను వదిలేసి సొంత పనుల కోసం అమెరికాలో పర్యటిస్తున్నారు అని విమర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే.. చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతూ ఆ ఇంటిని ఎలా కూల్చాలా అని చూస్తున్నారని ఉమా అన్నారు. వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రవీంద్ర డిమాండ్‌ చేశారు.