జర జాగ్రత్త… మూడో దశలోకి వచ్చాం..

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రస్తుతం మనం రెండో దశలో ఉన్నాం. మూడో దశకు చేరితే మన చేతిలో ఉండదు. అందుకే లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించాలి..’ అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో తొలుత జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం మంత్రులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గుంటూరులో కరనో పాజిటివ్‌ కేసుతో ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటోందన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, 60 ఏళ్ల వయస్సు దాటిన వారు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు.

 

మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి ముందస్తు సూచనలను వేగవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. సముద్రంలో వేట పూర్తిగా ఆపేశామన్నారు. ఇప్పుడిప్పుడే ఎగుమతులపై ఆంక్షలు సడలిస్తోన్నందున త్వరలో ఆక్వా రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను హోం ఐసోలేషన్‌లో ఉంచడం జరిగిందన్నారు. సమావేశంలో గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌ రావు, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్‌, మేరుగ నాగార్జున, యార్డు చైర్మన్‌ చంద్ర గిరి ఏసురత్నం, అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ, జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, జేసీ-2 శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

"
"