విజయసాయి వ్యాఖ్యలతో కలకలం.. అన్నీ మన వాళ్ళకే.. 12 వేల కోట్ల స్కాం

గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసినవారికి గ్రామస్థాయి వలంటీర్ల ఎంపికలో అవకాశం కల్పించడంలో విజయం సాధించామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారంటూ, ఓ వీడియోను టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తన ట్విటర్‌లో విడుదల చేశారు. వైసీపీ సోషల్‌ మీడియా విభాగం సమావేశం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగింది. లోకేశ్‌ విడుదల చేసిన వీడియో ప్రకారం, ఆ సమావేశంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ‘సోషల్‌ మీడియాలో మనపార్టీ కోసం పనిచేసినవారికి గుర్తింపు లేదని మీలో కొందరు అంటున్నారు. ఏ స్థాయిలో గుర్తింపు కావాలి? పార్టీలో పదవులా లేక ప్రభుత్వంలో అవకాశాలా? అదేమిటో స్పష్టంగా చెప్పాలి.

జగన్‌ అధికారం చేపట్టాక 3లక్షల పైచిలుకు వలంటీర్లను నియమించాం.అందులో వైసీపీ సోషల్‌ మీడియాకు రిజర్వేషన్‌ కల్పించాలని ఒక మిత్రుడు కోరారు. అలా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేం. ఇస్తే కోర్టులు కొట్టివేస్తాయి. అది చట్ట విరుద్ధం అవుతుంది కూడా! కానీ వైసీపీకి ఎవరైతే పనిచేశారో వారికి దానిలో (వలంటీర్ల ఎంపికలో) అవకాశం కలిగేలా ఆ బాధ్యతను పార్టీ చేపట్టింది. దానికి సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఏం చేశామో సభాముఖంగా చెప్పలేం. జీవోలు ఇవ్వలేం. దయచేసి అర్థం చేసుకోండి’ అని ఆయన అన్నారు. విజయసాయి ప్రసంగంపై లోకేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో స్పందించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వలంటీర్ల నియామకం జరిపామని సీఎం జగన్‌ ఆస్కార్‌ స్థాయిలో నటిస్తుంటే, దొంగ లెక్కల వీరుడు మాత్రం కడుపులో దాచుకోలేక తమ పార్టీ కుంభకోణాన్ని బయటకు కక్కేశారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

‘జగన్‌గారు స్కామ్‌ స్టార్‌ అని మరోసారి రుజువైంది. గ్రామ వలంటీర్ల కుంభకోణంలో రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారు. వలంటీర్ల నియామకంలో వైసీపీ కార్యకర్తా కాదా అని మాత్రమే చూశామని స్వయంగా ప్రకటిస్తున్నారు. 4లక్షల మంది వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి పది లక్షల మంది ఉద్యోగాలు తీసేసి, వారి పొట్ట కొట్టే భారీ కుట్ర పేరే వలంటీర్ల స్కీమ్‌’ అని మండిపడ్డారు.