కేసీఆర్ ని కేంద్రం వద్ద అడ్డంగా ఇరికించిన విజయశాంతి…

తెలంగాణా లో సీయం కేసీఆర్ పై, కాంగ్రేస్ ఫైర్ బ్రాంద్ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. సుప్రీం తీర్పుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే కేసీఆర్ మాత్రం ఎంఐఎం ప్రాపకం కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.‘‘అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించకుండా, తప్పించుకోవడం వెనక చాలా మతలబ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

దేశమంతా రామమందిరం నిర్మాణానికి సంబంధించి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంటే… తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యూలరిజం పేరుతో… ఎంఐఎం ప్రాపకం కోసం సుప్రీం తీర్పుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైకి తాను అసలైన హిందువు అని చెప్పుకునే కేసీఆర్ గారికి.. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతంలో ఆయన చేసిన కామెంట్‌ను చూస్తే అర్థమవుతుంది.రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని… అయోధ్య అంశాన్ని తోకతో పోలుస్తూ గతంలో కెసిఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనం. ఇంతకు ముందు తన మనసులోని మాటను బయటపెట్టిన కెసిఆర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేకపోతున్నారేమో? దీన్నే కుహనా లౌకిక వాదం అంటారు… గతంలో కెసిఆర్ గారు రామమందిరం పై ఏమన్నారో, ఈ వీడియో చూస్తే, దొరగారి అసలు నైజం అర్థమవుతుంది’’ అని విజయశాంతి పోస్ట్‌లో పేర్కొన్నారు.