వాలంటీర్ల విషయంలో గట్టి దెబ్బ.. నియామకాలు పూర్తయిన తర్వాత ఇంటర్యూలు..!

యాభై ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామ వాలంటీర్లను నియమిస్తామన్న సర్కార్.. ఆ పని ఇప్పుడు జోరుగా కొనసాగిస్తోంది. ఆశతో దరఖాస్తు చేసుకున్న లక్షల మందిని .. మండల స్థాయిలో ఇంటర్యూలు చేస్తున్నారు. చాలా చోట్ల.. కమిటీ సభ్యులు కూర్చుని ఉంటే.. ఇంటర్యూలకు వచ్చే వారు నిలబడి చేతులు కట్టుకుని.. సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇంత గౌరవంగా చేస్తున్న ఇంటర్యూల్లో…నిజాయితీ ఉందా అంటే… లేనే లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎవరెరర్ని నియమించారో… వైసీపీ నేతలు జాబితా రెడీ చేసి పంపించారని చెబుతున్నారు.

దాని ప్రకారమే నియామకాలు చేయడం ఖాయమంటున్నారు. గ్రామ వాలంటీర్ల ప్రకటన వచ్చిన తర్వాత… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రణాళిక ప్రకారం వ్యవహరించింది. ముందుగా బూత్ స్థాయి నేతలందర్నీ హైదరాబాద్ కు పిలిపించుకున్న విజయసాయిరెడ్డి… ఎలా.. యాభై ఇళ్లకు ఒకరు చొప్పున… వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా ఉండాలో… దిశానిర్దేశం చేశారు. ఎంపిక కోసం శిక్షణ ఇస్తామన్నారు. ఆ శిక్షణ కోసం.. ఎంపిక చేసిన వారంతా… ఇప్పుడు నియామకమైపోయారు. గ్రామ, మండల స్థాయి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు.. ఈ శిక్షణకు.. తమ కార్యకర్తలను పంపారు. వారే.. మిగతా వ్యవహారాలను చక్కబెట్టారు. ఊరికే.. ఓ ప్రాసెస్ కోసం.. ఇంటర్యూలను నిర్వహిస్తున్నారు.ఇవి ఉద్యోగాలు కాదని… ప్రభుత్వం చెబుతోంది. సేవా దృక్పథంతో పని చేయాలని అంటోంది. గౌరవ వేతనం ఇస్తున్నారు కాబట్టి… ఎలాంటి రూల్స్ పాటించకుండా.. నియామకాలు చేసేసుకోవచ్చు. అందుకే.. ఈ పద్దతి నడుస్తోంది. నిజంగా.. ఏ ప్రభుత్వ శాఖలో అయినా… ఇలాంటి నియామకాలు చేపట్టాలంటే… కేవలం .. మెరిట్ ప్రాతిపదికన తీసుకుంటారు.

కానీ ఇక్కడ.. వైసీపీ కార్యకర్తల్నే నియమించాలి కాబట్టి… ఇంటర్యూలు పెట్టి ఎంపిక చేస్తున్నారు. ఎవరెవర్ని ఎంపిక చేయాలో వైసీపీ నేతలే… లిస్ట్ పంపుతారు కాబట్టి.. వ్యవహారం సులువుగా జరిగిపోతోంది. ఇంత మాత్రం దానికి నిరుద్యోగుల్ని ఆశ పెట్టి.. మోసం చేయడం ఎందుకన్న భావన… సొంత ఊరిలో ఉండి… రూ. ఐదు వేలకైనా పని చేసుకుందామనుకుంటున్న యువతను నిరాశ పడేలా చేస్తోంది. అది అంతిమంగా ప్రభుత్వం చెబుతున్న ఆదర్శాలకు విరుద్ధంగా వ్యవరహిస్తోందన్న భావన ప్రజల్లోకి వెళ్లేలా చేస్తోంది.