టీఆర్ఎస్‌లో ధిక్కార స్వ‌రాలు.. కేసీఆర్ చెప్పినా లెక్క చేయడం లేదు

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో ధిక్కార స్వ‌రాలు వినిపిస్తున్నాయా? అక్క‌డ అధినేత కేసీఆర్‌కు విరుద్ధంగా నాయ కులు సొంత లైన్ తీసుకుని ముందుకు వెళ్తున్నారా? అంటే.. తాజాగా వెలువ‌డిన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాలు దీనినే రుజువు చేస్తున్నాయి. అత్యంత కీల‌కంగా భావించిన నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ ఎస్ చ‌తికిల ప‌డింది. ముఖ్యంగా కేసీఆర్ త‌న‌య క‌విత నిజామాబాద్‌లో ఓడిపోవ‌డం పార్టీ శ్రేణుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. అదేవిధంగా భువ‌న‌గిరి నుంచి బ‌రిలో నిలిచిన బూర న‌ర్స‌య్య గౌడ్ కూడా ఓడిపోయారు.

ఈ నేప‌థ్యంలో ఇంత ఓట‌మికి గ‌ల కార‌ణాల‌పై అభ్య‌ర్థు లు దృష్టిపెట్టిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. తెలంగాణ బెబ్బులి మాదిరిగా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్‌కు పార్టీలోనే ధిక్కార స్వ‌రాలు వినిపించ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. భువ‌న‌గిరి ఎంపీగా టికెట్‌ను బూర న‌ర్స‌య్య గౌడ్‌కు ఇచ్చారు కేసీఆర్‌. ఆయ‌న‌ను గెలిపించే బాధ్య‌త‌ను భువ‌న‌గిరి ఎంపీ ప‌రిధిలోని జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బొమ్మిడి సునీతా రెడ్డి, భువ‌న‌గిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖ‌ర‌రెడ్డికి అప్ప‌గించారు. అయితే, వీరు ఆదిలోనే … న‌ర‌స‌య్య గౌడ్‌ను వ‌ద్ద‌ని వేరే వారికి టికెట్ ఇవ్వాల‌ని కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు స‌మాచారం. కానీ, కేసీఆర్ మాత్రం గౌడ్‌కే టికెట్ ఇచ్చారు. దీంతో వీరంతా తమ సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డికి ప‌రోక్షంగా సాయం చేశార‌నేది వాద‌న‌.దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దీంతో విష‌యం మ‌రిం త వేడెక్కింది. ఇదే విష‌యం తాజాగా తెలంగాణ‌లో రాజ‌కీయ సెగ‌లు పుట్టిస్తోంది. మ‌రీ ముఖ్యంగా తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టారా? అనే కోణంలో ఈ ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని స‌మాచారం. పైళ్ల శేఖర్‌రెడ్డి ఓ హోటల్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసి మాట్లాడిన ఫొటో, వీడియోను టీఆర్‌ఎస్‌లోని బీసీ నాయకుడొకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు వాట్సా్‌పలో, ట్విటర్‌లో పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మ‌రోప‌క్క‌, నిజామాబాద్‌లోనూ ఇదే త‌ర‌హా ధిక్కారం క‌నిపించింది. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ త‌న‌య క‌విత ఈ ద‌ఫా కూడా గెలిచి తీరాల‌నే క‌సితో ఇక్క‌డ నామినేష‌న్ రోజు నుంచి కూడా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు., ప్ర‌చారం నిర్వ‌హించారు. అయితే, ఆమెను ఓడించేందుకు కూడా తెర‌చాటుగా కొంద‌రుఎమ్మెల్యేలు ప‌నిచేశార‌ని తెలిసింది. క‌విత గెలిస్తే.. త‌మ ఆధిప‌త్యానికి ముప్పు వ‌స్తుంద‌ని, ఆమె త‌మ‌తో గేమ్ ఆడుతుంద‌ని భావించిన కొంంద‌రు ఎమ్మెల్యేలు క‌విత‌ను ఓడించేందుకు కృషి చేసిన‌ట్టు తెలిసింది. మొత్తానికి ఈ ప‌రిణామాలు తెలంగాణాలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రి కేసీఆర్ ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.