ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్‌కు బిగ్ టార్చ‌ర్‌… ప్ర‌కాశం వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఏపీలో ప్రకాశం జిల్లాలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ ముగ్గురు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పేరు చెబితే వైసీపీ అధినేతకు ఎక్కడా లేని తలనొప్పి వచ్చేస్తుందట. వైసీపీ జిల్లా నాయకత్వంతో పాటు పార్టీ అధిష్టానానికే కొరుకుడు పడని ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు, ఆ కథ ఏంటో చూద్దాం. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు యువ ఎమ్మెల్యేలు అయిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌, ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతూ నాలుగో విజయానికి రెడీ అవుతున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, పర్చూరు నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడ వైసీపీని భూస్థాపితం చేసిన ఏలూరి సాంబశివరావు ఈ ముగ్గురు ఎమ్మెల్యేల దెబ్బకు వైసీపీ విలవిల్లాడుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద విపక్ష వైసీపీ నుంచి పోటీ చేసే అభ్య‌ర్థులు పోటీ విషయంలో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా డైలమాలో పడుతున్నారు.

పోటీ చేస్తే గెలుస్తామన్న గ్యారెంటీ లేదు కానీ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలన్న ఆశతో ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఉన్నారంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేల దూకుడు ఎలా ఉందో తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు మంచి పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. 2004లో మార్టూరు, 2009, 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన రవికుమార్‌కు తిరుగులేని ఇమేజ్‌ ఉంది. నియోజకవర్గాలు మారినా, పార్టీలు మారినా రవికుమార్‌కు తిరుగులేని వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉంది. అద్దంకి లాంటి సంక్లిష్టమైన నియోజకవర్గంలో ఎవరిని నొప్పించకుండా రాజకీయం చేస్తూ అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రవికుమార్ త‌న‌కు చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో వేలాది మందికి లబ్ధి చేకూరేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. 15 సంవత్సరాల క్రితం రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గొట్టిపాటి వరుస‌ విజయాలతో పాటు రేపటి ఎన్నికల్లో నాలుగో విజయం సాధించనున్నారు.

అద్దంకిలో గొట్టిపాటి గెలుపు నల్లేరు మీద నడకే. విచిత్రం ఏంటంటే అద్దంకిలో ఇప్పటి వరకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలనుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా గెలుస్తాన‌న్న గ్యారెంటీ లేకపోవడంతో ముందుకు వెనకకు ఊగిసలాటలో ఉన్నారు. అదే టైమ్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన వెంకటరెడ్డి కూడా రేసులోకి వచ్చారు. వీరిలో ఎవరికి సీటు ఇచ్చినా గొట్టిపాటి మెజారిటీ మీదే లెక్కలు వేసుకోవాలి తప్పా ఆయన గెలుపును ఆపే పరిస్థితి లేదు. ఇక జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రకాశం జిల్లాలో దశాబ్దన్నర తర్వాత పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకువచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ దూకుడు ముందు ఒంగోలు పార్లమెంట‌రీ జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసుల‌రెడ్డి బేజారు అవుతున్నారు. నాలుగున్నర ఏళ్లలో ఒంగోలులో ఎంత అభివృద్ధి జరిగింది, నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఒంగోలుకు ఎమ్మెల్యేలుగా పని చేసిన వారి టైమ్‌లో ఎంత అభివృద్ధి జరిగిందన్నది బేరీజు వేసుకుంటే ఒంగోలులో గత 50 ఏళ్లలో జ‌రిగిన‌ అభివృద్ధిని మించిన అభివృద్ధి కేవలం నాలుగున్నర ఏళ్లలో జనార్ధన్‌ చేసి చూపించారు.

పెద్ద పల్లెటూరుగా ఉన్న ఒంగోలు రూపురేఖలు మార్చేసి ఒంగోలుకు నిజమైన కార్పొరేషన్ లుక్‌ తీసుకురావడంతో పాటు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఒంగోలు నగర నిర్మాణకర్తగా జనార్ధన్‌ పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకు వచ్చి ఒంగోలు అభివృద్ధిని చూసి జనార్ధన్‌ను పార్టీలకు అతీతంగా ప్రశంసిస్తున్నారు. ఇక నాలుగేళ్లుగా హైదరాబాద్‌కు పరిమితం అయిన బాలినేని ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ముందు ఒంగోలు వచ్చి ఇటు జనార్ధన్‌ను ఎలా ఓడించాలో తెలియక ఒక వైపు అటు సొంత పార్టీలో ఉన్న అస‌మ్మ‌తిని చల్లార్చలేక మరో వైపు సతమతం అవుతున్నారు. గత ఎన్నికల్లో తొలి సారిగా అసెంబ్లీకి పోటీ చేసిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గంలో వైసీపీని దాదాపు భూస్థాపితం చేసేశారు. నాలుగున్న ఏళ్లలో పర్చూరు నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది.

పర్చూరులో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి భరత్‌ ఇప్పటికే ఏలూరి దూకుడు చూసి తాను మరో సారి ఆయన చేతిలో ఓడలేనని చేతులు ఎత్తేయగా కొత్త ఇన్‌చార్జ్‌గా వచ్చిన రావి రామనాథం పార్టీ తరపున చేస్తున్న కార్యక్రమాలకే స్పందన లేక ఊసురో మంటున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధిష్టానమే పర్చూరు సీటు పోతే పోయింది ఆ సీటు గొడవ వదిలేసి మిగిలిన సీట్లపై దృష్టి పెట్టండని జిల్లా నాయకత్వానికి సూచన చేసిందంటే ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి ఎంతలా దిగజారిందో తెలుస్తోంది. ఏదేమైనా ప్రకాశం జిల్లాలో ఈ ముగ్గురు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై పోటీ చేసేందుకు వైసీపీ నాయకులే ముందుకు రావకపోవడం, ముందుకు వెనకకు ఊగిసలాడడం బట్టీ చూస్తే ఈ నియోజకవర్గాల్లో వీళ్లు ఎంత బలంగా ఉన్నారో తెలుస్తోంది. ఇక ఈ మూడు సీట్ల‌లో వైసీపీ ప‌రిస్థితి జ‌గ‌న్‌కు పెద్ద టార్చ‌ర్‌గా మారింద‌ట‌. మరి ఎన్నికల వేళ‌కు అయినా ఈ పరిస్థితిలో కొంత వరకు మార్పు వస్తుందేమో ? చూడాలి.