నిన్నటిదాకా గజిబిజి..! ఆ జిల్లాలో ఇప్పుడు వార్ వన్ సైడ్..!

నెల్లూరు నగరం, రూరల్‌, సర్వేపల్లి స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో టీడీపీ అడ్వాంటేజ్ సాధించింది. ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడులను ఆకర్షించిన తెలుగుదేశం ప్రస్తుతం కావలి మాజీ ఎమ్మెల్యే లు విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డిలపై దృష్టి సారించింది. వీరిని పార్టీలోకి ఆహ్వానించడానికి పార్టీ వర్గాలు సంప్రదింపులు జరు పుతున్నాయి. ఈ ఇద్దరిని ఆకర్షించడం ద్వారా మూడు నియోజకవర్గాల్లో పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. విష్ణుకు కావలి, ఉదయగిరి, కోవూరు నియోజకవర్గాల్లో అనుచరవర్గం ఉంది. ఒంటేరు వేణుగోపాల్‌ రెడ్డికి ఉదయగిరి నియోజకవర్గంలో పట్టుంది. కావలి వైసీపీ ఎమ్మెల్యేతో విభేదించి పార్టీకి దూరంగా ఉన్న ఈ ఇద్దరిని ఆకర్షించడం ద్వారా మూ డు నియోజకవర్గాల పరిధిలో లబ్ధి పొందవచ్చని పార్టీ అధిష్ఠానం భావిస్తుంది.

వీరిద్దరితో టీడీపీ సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంతోపాటు, నేతల మధ్య అంతర్గత విభేదాలను సరిదిద్దడం, పార్టీ కోసం శ్రమించినా టిక్కెట్టు రేస్‌లో విఫలమైన ఆశావహులకు సముచిత న్యాయం చేసే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త శక్తులను కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టడం ద్వారా జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపు కోసం పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగడంతో టీడీపీ వర్గాల్లో వాతావరణం వేడెక్కింది. కోవూరు ఎమ్మెల్యే పొలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి, నియోజకవర్గ నాయకులకు మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి మంత్రి సోమరెడ్డి, ఆదాల, బీద రవిచంద్రలతో త్రిమెన్‌ కమిటీని నియమించారు. గురువారం రాత్రి జరిగిన జిల్లా నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఆరు నెలలుగా నాయకుల మధ్య విభేదాలు ఉన్నా ఎందుకు స్పందించలేదని జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవించంద్రపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ నియోజకవర్గం నేతలతో మంచి సంబంధాలున్న సోమిరెడ్డి, ఆదాల, బీద రవిచంద్రలతో త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో ఎమ్మెల్యే పోలంరెడ్డి, స్థానిక నాయకుల మధ్య సఖ్యత కుదర్చాలని సీఎం వీరిని ఆదేశించారు. మైనస్ లు అన్నీ ప్లస్ లుగా మారుతూండటంతో.. నెల్లూరు టీడీపీకి ఎదురు లేని పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.