ఏపీకి హోదా ఖాయం… ఎప్పుడో తేల్చేసిన మోడీ..?

ఆంధ్రప్రదేశ్ కి సంజీవని పోలవరం. ఆంధ్రప్రదేశ్ కి పురోభివృద్దికి అలంబనం ప్రత్యేక హోదా. పోలవరం నిర్మాణం చంద్రబాబు సారధ్యంలో శరవేగంగా జరుగుతుంది. కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కోసం పోరాటం కూడా చంద్రబాబు నేతృత్వంలో ఉదృతంగా సాగుతోంది. హోదాపై మోడీ చేసిన మోసాన్ని ఢిల్లీ సాక్షిగా ఎండగట్టిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా హక్కుకు జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. ఢిల్లీ దీక్ష సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు హోదా ఎప్పుడు వస్తుందో తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం మారితే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత ధీమా వ్యక్తంచేశారు. హోదా పోరును తమ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ స్థాయికి తీసుకెళ్లారని.. ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్షకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలు పార్టీల ప్రధాన నేతలు హాజరై మద్దతివ్వడం విశేష పరిణామమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ‘విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్‌ ఇంతకు ముందు రాష్ట్రం వరకే పరిమితమైన అంశంగా ఉండేది. కానీ ముఖ్యమంత్రి ఢిల్లీలో చేపట్టిన దీక్షకు ఇంత మంది నేతలు హాజరై సంఘీభావం ప్రకటించడం వల్ల అదిప్పుడు జాతీయ అంశంగా మారింది.

ఆ డిమాండ్‌కు మెజారిటీ పార్టీల నుంచి సానుకూలత వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం మారితే రాష్ట్రానికి హోదా రావడం ఖాయమన్న అభిప్రాయం కలిగించింది’ అని టీడీపీ ఎంపీ ఒకరు అన్నారు. తమకిచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానిలో దీక్ష చేపట్టడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. పైగా బీజేపీ వ్యతిరేక శిబిరంలో చురుగ్గా ఉన్న చంద్రబాబు స్వయంగా ఈ దీక్ష చేపట్టడంతో మిగిలిన పార్టీల నుంచి ఘనంగా ప్రతిస్పందన వచ్చింది. రాష్ట్రానికి హోదా ఇవ్వడంపై ఇతర రాష్ట్రాలకు అభ్యంతరాలు ఉన్నాయని కేంద్రంలో కొందరు గతంలో చెప్పేవారు. ఇప్పుడు ఈ దీక్షకు సంఘీభావం తెలపడం వల్ల ఆ వాదన వెనక్కి వెళ్లిపోయిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రాజకీయ కోణంలో చూసినప్పుడు ఈ దీక్ష రెండు కోణాల్లో సఫలమైందని టీడీపీ ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు.‘ప్రధాని మోడీ మొదలుకొని ఇతర ప్రతిపక్షాల నేతల వరకూ మేం కాంగ్రెస్ కు సన్నిహితం కావడంపై దాడి చేస్తున్నారు. కాంగ్రెస్‌ హోదా ఇస్తానని ప్రకటించినందునే ఆ పార్టీ సహకారం కోరుతున్నామని చంద్రబాబు బదులిచ్చారు కూడా. ఇప్పుడు ఆయన దీక్షకు రాహుల్‌తో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా హాజరు కావడం ఆ విమర్శలకు బలమైన సమాధానం ఇచ్చినట్లయింది. మన్మోహన్‌ సాధారణంగా బయట ఏ రాజకీయ కార్యక్రమంలో కనిపించరు. కానీ ఆయన కూడా వచ్చారు. రాష్ట్రానికి న్యాయం చేయడానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని దీని ద్వారా మరోసారి చాటిచెప్పినట్లయింది. రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమే కాంగ్రె్‌సకు టీడీపీకి దగ్గరవుతోందని ప్రజలకు అర్థమైంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక.. వైసీపీ బీజేపీకి సన్నిహితమని రుజువు చేయడానికి కూడా ఈ దీక్ష ఉపయోగపడిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

‘ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తుంటే వైసీపీ నోరెత్తి ప్రశ్నించలేకపోయింది. రాష్ట్ర అవసరాలపై ముఖ్యమంత్రి దీక్ష చేస్తే దానిపైనా తన వైఖరిని చెప్పలేకపోయింది. రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటంలో వైసీపీ పాత్ర గానీ.. చిరునామా గానీ కనిపించడం లేదు. బీజేపీకి దగ్గరగా ఉన్నందువల్లే ఆ పార్టీ మౌన ముద్ర వహిస్తోందని అందరికీ తెలియడానికి దీక్ష ఉపయోగపడింది’ అని టీడీపీ నేత ఒకరు చెప్పారు. టీఆర్ఎస్‌, మజ్లిస్‌ కూడా బోనులో నిలబడాల్సి వచ్చిందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు వస్తామని.. ఇక్కడి రాజకీయాల్లో వేలు పెడతామని ఈ రెండు పార్టీల అధ్యక్షులు ఘనంగా ప్రకటించారు. ప్రత్యేక హోదాకు తమ మద్దతు కూడా ఉందన్నారు. అదే డిమాండ్‌తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానిలో దీక్ష చే స్తే ఈ పార్టీల నేతలు కనీసం సంఘీభావం ప్రకటించలేదు. తెలుగువారు కాకపోయినా ఇతర రాష్ట్రాల పార్టీల నేతలు వచ్చి దీక్షకు మద్దతు తెలిపితే.. పొరుగున తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దాని మిత్రపక్షం రాకపోవడంలో అర్థమేంటి? వాటికి కూడా బీజేపీతో వైసీపీలాంటి సంబంధాలే ఉన్నాయి. ఈ మూడు పార్టీలూ ఒకే గూటి పక్షులని.. బీజేపీ పక్షమని మరోసారి రుజువైంది’ అని ఆయన అన్నారు.