తెలుగుదేశం అలా చేసి ఉండాల్సిందా…?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వ రాజకీయం చూసి దేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా చాలా నేర్చుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనేది సర్వ సాధారణమైన విషయం, నియంతల మాదిరిగా వాటిని రాకుండా బెదిరిస్తే ఆ తిరుగుబాటు ఎప్పటికి అయినా వస్తుంది. ప్రజల్లో ఏ స్థాయిలో మద్దతు ఉన్నా సరే ఈ విధంగా ప్రవర్తించడం మాత్రం మంచి విధానం కాదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమపై వస్తున్న విమర్శలను భయపెట్టి కట్టడి చెయ్యాలని చూడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.రాజకీయంగా బలంగా ఉన్న ఆ పార్టీ ఏకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చింది. సోషల్ మీడియాలో గాని ఎక్కడైనా సరే తమకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు అరెస్ట్ చేస్తున్నారు.

తాజాగా యలమంచిలి పద్మజ అనే మహిళను అరెస్ట్ చేసారు. ఈ నేపధ్యంలో… ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పలువురు కీలక సూచనలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాజకీయం చేసి ఉంటే ఎంతో బాగుండేది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా చంద్రబాబు లాంటి నేత,తన మీద విమర్శలు చేసిన వాళ్ళను కూడా బెదిరించో, బ్రతిమిలాడో తన వైపుకి తిప్పుకోవాలని చూస్తారు. అందుకే రవీంద్ర ఇప్పాల అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కూడా విడుదల చేసారు. అప్పుడు గనుక తెలుగుదేశం పార్టీ ఈ విధంగా విమర్శలు చేసిన వాళ్ళను కట్టడి చేసి ఉంటే తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్ళేవి కావు, రాజధానిలో అరటి తోటలు తగలబెట్టిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే నేడు పరిస్థితి ఇంకోలా ఉండేదని వాళ్ళే ఇప్పుడు హీరోలు అయ్యారని… ఇప్పటికి అయినా సరే ప్రభుత్వాన్ని విపక్షం, ప్రధానంగా చంద్రబాబు చాలా నేర్చుకోవాలని సూచిస్తున్నారు.