టీడీపీ వీడడంపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీని వీడి ఎవరు బయటకు పోతున్నారు. ఏయే నేతలు టీడీపీ వీడి బీజేపీలో చేరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. బీజేపీ కూడా టీపీపీపై మైండ్ గేమ్ ఆడుతుంది. వాళ్ళు వచ్చేస్తున్నారు.. వీళ్ళు వచ్చేస్తున్నారు అంటూ రోజూ లీకులతో కాక రేపుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ వీడి బీజేపీలో చేరుతున్నారంటూ చర్చ మొదలైంది. దీనిపై వంశీ చాలా స్పష్టంగా సూటిగా స్పందించారు. వల్లభనేని వంశీ మోహన్‌ను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బీజేపీ చేరాలని ఆహ్వానించినట్టుగా ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా టీడీపీ సమావేశాలకు వంశీ దూరంగా ఉంటున్నారు. శనివారం చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశానికి కూడ ఆయన దూరంగా ఉన్నారు.

అయితే ఈ ప్రచారాన్ని వంశీ తోసిపుచ్చారు. తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదంతా ఒట్టి ప్రచారమేనని తేల్చేశారు.టీడీపీని వీడి బీజేపీలో చేరాలని సుజనా కోరినందునే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా…. మరేదైనా కార్యక్రమాల వల్ల ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. 2014 ఎన్నికలకు ముందు విజయవాడలో జగన్ ప్రదర్శన సాగుతున్న సమయంలో వల్లభనేని వంశీని ప్రస్తుత మంత్రి కొడాలి నాని పరిచయం చేశారు. ఆ సమయంలో జగన్‌ను వంశీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు. ఈ ఘటన ఆనాడు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వేర్వేరు పార్టీల్లో ఉన్నా కూడ కొడాలి నానితో వల్లభనేని వంశీ కి మంచి సంబంధాలే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఆశనిపాతంగా మారాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీలోని కీలక నేతలను తమ వైపుకు లాక్కొనేందుకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే వంశీకి బీజేపీ గాలం వేసేందుకు మాజీ కేంద్ర మంత్రి సుజనా రంగంలోకి దిగాడనే ప్రచారం సాగుతోంది. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాలకు చెందిన టీడీపీ నేతలతో సుజనా చౌదరి చర్చలు జరుపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

ఇదిలా ఉంటే బీజేపీలో చేరుతున్నానని వస్తున్న వార్తలపై వల్లభనేని వంశీ స్పందించారు. తనతో సుజనా చౌదరి మాట్లాడలేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరుతున్నాననే ప్రచారం అవాస్తవమన్నారు. కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. ఓ మీడియా చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయినప్పటికీ టిడిపి నుంచి వలసలు జోరుగా సాగుతున్నాయన్న ప్రచారానికి మాత్రం తెర పడడం లేదు. బీజేపీ నేతలు కూడా ఈ ప్రచారాన్ని జోరుగానే సాగిస్తున్నారు.