టీడీపీలో కలకలం… ఎంపీ… ఎమ్మెల్సీల ట్విట్టర్ వార్…!

నాయకుల స్వార్ధమే పార్టీని నాశనం చేస్తుందని కార్యకర్తలు ఘోషిస్తున్నా టీడిపి నేతల్లో మాత్రం ఆత్మ పరిశీలన ఉండడం లేదు. పార్టీని బతికించేందుకు కార్యకర్తలు అహర్నిశలు కష్టపడితున్నా… ప్రత్యర్థి నేతల దాడుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నా నేతల్లో ఆధిపత్య పోటు మాత్రం తగ్గడం లేదు. పదవులలో ఉన్న నేతలంతా ఆధిపత్య పోరాటంలో పార్టీని ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. పార్టీ ఘోరంగ ఓడిపోయిన తర్వాత కూడా నేతలు స్వార్ధ చింతన వీడడం లేదు. ముఖ్యంగా కొన్నాళ్లుగా రాజధాని నగరం విజయవాడలో కీలక నేతలైన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బద్దా వెంకన్నలు ఒకరిపై మరొకరు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ట్విట్టర్ వేదికగా తిట్టుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.

తమ మధ్య ఉన్న విభేదాలను సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా వెల్లగక్కుతున్నారు. ఇంతకుముందే టీడీపీ ఎంపీ కేశినేని నాని.. సొంత పార్టీకి చెందిన నేతనుద్దేశించి ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలు తననుద్దేశించినవే అన్నట్లుగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంతే ఘాటుగా స్పందించారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. ఎంపీ కేశినేని వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన బుద్దా వెంకన్న… ఆయన పేరును ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు చేశారు.పార్టీ కోసం పోరాడే వాడు కావాలి తప్ప.. ఇతర పార్టీ నేతలతో కలిసి కూల్చేవాడు కాదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ బుద్దా వెంకన్న ఏమన్నారంటే.. ‘‘సంక్షోభ సమయంలో పార్టీ కోసం, నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీల నాయకులతో కలిసి కూల్చేసేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశవాదులు కాదు.. చనిపోయేవరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’’ అని పేర్కొన్నారు. కాగా, దీనికి ముందు.. ఎంపీ కేశినేని నాని బుద్దా వెంకన్ననుద్దేశించి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. “నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అని కేశినేని ట్వీట్ చేశారు. అయితే… ఈ ట్వీట్ సొంత పార్టీ నేతను ఉద్దేశించి చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పార్టీ అధికారంలో ఉన్నన్ని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రం కోసం తపించారు. అయినా ఓటమి తప్పలేదు. దీనికి కారణం నేతల్లో ఉన్న అనైక్యత. నేతల వల్ల పార్టీ ప్రజల్లో పలుచన అయినా నేతల తీరు మాత్రం మారడం లేదు. ఒకప్పుడు ఇలాంటి క్రమశిక్షణరాహిత్యాన్ని చంద్రబాబు అసలు సహించేవారు కాదు. ఇపుడు కూడా అంతే కఠినంగా ఉంటే తప్పించి పార్టీకి భవిష్యత్తు ఉండదని పలువురు నేతలు వాపోతున్నారు.