టీడీపీకి భారీ విరాళాలు.. ప్రాంతీయ పార్టీలలో ఇదే హైయ్యేస్ట్

తెలుగుదేశం పార్టీకి 2018-19లో రూ.26.17 కోట్లు విరాళాల రూపంలో అందాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకు మించి విరాళంగా అందించిన వారి వివరాలతో కూడిన నివేదికను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.నర్సిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. పై మొత్తంలో అత్యధికంగా రూ.25 కోట్లు ఫ్రూడెంట్‌ ఎన్నికల ట్రస్టు విరాళంగా ఇచ్చింది. అప్పటి టీడీపీ నేతలు… ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 లక్షలు, రఘురామ కృష్ణంరాజు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు.

టీడీపీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు, సీనియర్‌ నేత వేగేశన నరేంద్రవర్మ రాజు రూ.5 లక్షలు చొప్పున ఇవ్వగా ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాటి టీడీపీ నాయకురాలు షేక్‌ నూర్‌జాన్‌ రూ.4.20 లక్షలు ఇచ్చారు. టీడీపీ నేతలు కొండూరు అశోక రాజు, దేవినేని అవినాశ్‌ రూ.3 లక్షలు చొప్పున ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే యామినీబాల, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, ప్రస్తుత వైసీపీ నేత బుట్టా రేణుకకు చెందిన బుట్టా ఫౌండేషన్‌ రూ.లక్ష చొప్పున విరాళం ఇచ్చారు. సంస్థలుగానీ, వ్యక్తులు కానీ… మొత్తం 56 మంది రూ.20 వేలకుపైగా విరాళం ఇచ్చిన వారిలో ఉన్నారు.

విరాళాలు తీసుకోని అన్నాడీఎంకేతమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే 2018-19లో ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదు. శిరోమణి అకాలీదళ్‌ రూ.1.75 కోట్లు, ఐఎన్‌ఎల్‌డీ రూ.1.75 కోట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన రూ.79 లక్షలు విరాళాలు పొందినట్లు లెక్కలు చూపించాయి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘానికి విరాళాల వివరాలను కేవలం ఈ 5 పార్టీలు మాత్రమే అందించాయి.