టీడీపీకి బిగ్ షాక్.. బీజేపీలోకి కీలక నేత

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీకి మరోసారి భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటి వరకు ఆ పార్టీలో ముఖ్యనేతగా ఉన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొవ్వా సత్యనారాయణ తన అనుచరులతో పాటు పలు డివిజన్లకు చెందిన పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కిందిస్థాయి కార్యకర్తలతో కలిసి గరికిపాటి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలో బలమైన నాయకులు, క్యాడర్‌ టీఆర్‌ఎస్‌లో చేరగా మిగిలిన క్యాడర్‌ తాజాగా బీజేపీలో చేరనుండటంతో పార్టీకి గట్టిదెబ్బ తగలనుంది. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మొవ్వా సత్యనారాయణ స్వల్ప ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి భిక్షపతి యాదవ్‌పై ఓడిపోయారు.

అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నం చేసినప్పటికీ టికెట్‌ లభించకపోవడంతో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. 2018 ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. అయితే అప్పట్లో టికెట్‌ ఇవ్వలేకపోయినా చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టి సముదాయించారు. ఇటీవల పార్టీకి దూరం గా ఉన్న మొవ్వా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి వందలాదిమంది పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ మియాపూర్‌, హఫీజ్‌పేట డివిజన్ల అధ్యక్షులు డీఎస్ఆర్‌కె ప్రసాద్‌, మన్నేపల్లి సాంబశివరావుతో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు భారీగా వాహనాల్లో తరలివెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అయితే టీడీపీలో మొవ్వాకు వ్యతిరేకంగా ఉన్న మరో వర్గం బీజేపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ మొవ్వా చేరుతుండటంతో గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు.

అయితే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్తున్న మొవ్వా రాకను బీజేపీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మొవ్వా చేరికతో పార్టీకి నష్టం వస్తుందని, అతని మీద పలు అక్రమ కేసులు ఉన్నాయని, పూటకో పార్టీ మారుస్తున్నారని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.