క్యాడర్ లో ధైర్యం పెరిగిందా…? ప్రభుత్వ వ్యతిరేకతే కారణమా…?

ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో పదేళ్ళు అధికారంలో లేకపోయినా సరే… ఆ పార్టీని కాపాడింది క్యాడరే అనే విషయం అందరికి స్పష్టంగా తెలుసు. పార్టీని ఆర్ధికంగా ఆధుకోలేకపోయినా సరే… పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకుని, తమ తమ నియోజకవర్గాల్లో కంటికి రెప్పలా కాపాడుకుంది కార్యకర్తలే. సోషల్ మీడియాలో ఇప్పుడు హడావుడి చేసే చాలా మంది పార్టీ అధికారంలో లేనప్పుడు మాత్రం ఎప్పుడు కనపడలేదు. క్షేత్ర స్థాయిలో పని చేసిన కార్యకర్తలు… పార్టీ కోసం చాలానే నష్టపోయారు.మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం క్యాడర్ లో ఒకరకమైన భయం మాత్రం ఏర్పడింది అనేది వాస్తవం.

అయితే ఇప్పుడు ప్రభుత్వ విధానాలతో ఆ క్యాడర్ లో ధైర్యం క్రమంగా పెరుగుతుంది. అప్పులు చేస్తూ ఆస్తులను అమ్ముతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇది ఎక్కువ కాలం నడిచే సినిమా కాదు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఉండాలి అంటే అభివృద్ధి అనేది తప్పని సరి… అభివృద్ధి లేకపోతే కంపెనీలు రావడం గాని, వసతులు పెరగడం గాని, పర్యాటక రంగం గాని బలపడే అవకాశం ఉండదు.మహా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఇంకో రెండు నెలలు నడిస్తే గగనమే అనే అభిప్రాయం వినపడుతుంది. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది… భవిష్యత్తులో అది మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి పరిస్థితి అర్ధమైందని, చంద్రబాబు విలువ ఏంటి అనేది జనాలకు తెలిసిందని అంటున్నారు పరిశీలకులు. గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, క్రమంగా ప్రభుత్వంపై నమ్మకం కూడా పోతుందని… మత ప్రచారం వంటివి ఇబ్బందికరంగా మారాయని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తుంది.