నేను స్పీకర్ కాదు ఎమ్మెల్యే.. టీడీపీ నేతలపై తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సభాపతిగా ఉన్న తాను విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని అన్ని పక్షాలను కలుపుకొని పోతానని చెప్పిన తమ్మినేని తాజాగా టీడీపీ వాళ్ళు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ముందు ఎమ్మెల్యేనని ఆ తర్వాతే స్పీకర్ అని ప్రకటించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘ఏ గొట్టంగాళ్లు అడ్డుతగిలినా భయపడవద్దు. వలంటీర్ల ఎంపికపై టీడీపీకి చెందిన ఎవడైనా, కోన్‌కిస్కాగొట్టాంగాడు పిటిషన్‌ వేస్తే భయపడవద్దు’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం నిర్వహించిన గ్రామవలంటీర్ల అవగాహన సదస్సులో స్పీకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘మీపై ఆరోపణలు వచ్చాయని ఎవడో టీడీపీవాడు, కోన్‌కిస్కాగొట్టంగాడు పిటిషన్లు వేస్తే మీరేమీ భయపడవద్దు. ధైర్యంచేసుకొని వెళ్లండి. మీ వెనుక నేనున్నాను. మీరు జగన్మోహన్‌రెడ్డి ప్రతినిధులు. మీరు పనిచేయండి. మీ వెనుక మేం ఉంటాం.ఎవడో ఏదో అంటే మీరు భయపడాల్సిన పనిలేదు. మేమేమీ జన్మభూమి కమిటీ సభ్యుల్లా అర్హత లేనివారికి ఇవ్వలేదు కదా’’ అని సీతారాం తీవ్ర స్వరంతో అన్నారు. వలంటీర్ల విధుల నిర్వహణ సమయంలో కొంతమంది అడ్డుతగలాలని చూస్తారని, అప్పుడు తాను ఉన్నానన్న ధైర్యంతో ముందుకెళ్లాలని వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు భక్షకభటులైతే, ఈ ప్రభుత్వంలో వలంటీర్లు రాష్ట్ర ప్రజల రక్షక భటులని తెలిపారు.

‘‘అసెంబ్లీలో సామాజిక న్యాయంతో చట్టాలు చేసిన దమ్మున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌. మహిళలకు సగం రిజర్వేషన్లను కల్పిస్తూ చేసిన చట్టం చరిత్రాత్మకం. గ్రామ వలంటీర్ల వ్యవస్థ పనితీరును ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తుంటారు. పేస్కేలు వరకూ ఉద్యోగభద్రత కలిగేలా చూస్తానని భరోసా ఇస్తున్నా’’ అని తమ్మినేని సీతారాం తెలిపారు.