మోడీ నియమించుకున్న తెలుగు అధికారికి సుప్రీం చివాట్లు

వ్యవస్థల దుర్వినియోగంలో ఏ మాత్రం జంకు బొంకు లేకుండా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీకి ఇది ఎదురు దెబ్బ. సీబీఐ ప్రతిష్ఠని దెబ్బతీసి తన సొంత సంస్థగా మార్చేసిన బీజేపీ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. సీబీఐ పరువు బజారున పడడంలో మోడీ పాత్ర ఏమీటో దేశం మొత్తం చూసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా మోడీ నియమించిన అధికారి తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టింది. మోడీ సన్నిహిత అధికారికి సీబీఐ డైరెక్టరుకు ఏర్పడ్డ వివాదాలతో ఆ ఇద్దరిని తప్పించి కొత్తగా నాగేశ్వరరావు అనే తెలుగు అధికారిని మోడీ ప్రభుత్వం సీబీఐ డైరెక్టరుగా నియమించారు. ఇప్పుడు ఆ నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాలను సుప్రీం తప్పుబట్టింది. పైగా లక్ష రూపాయలు జరిమానా విధించింది. ముజఫర్‌పుర్ షెల్టర్ అత్యాచారాల కేసులో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి బదిలీలూ చేయకూడదనే ఉత్తర్వులు అమల్లో ఉన్నా.. దర్యాప్తు అధికారి ఏకే శర్మను ఎలా బదిలీ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.

నాగేశ్వరరావు సోమవారం కోర్టుకు నివేదించిన క్షమాపణను కూడా సుప్రీం తిరస్కరించింది. దీంతో పాటు నాగేశ్వరరావుకు రూ. లక్ష జరిమానా విధించింది. సీబీఐ కేసుపై మంగళవారం విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. నాగేశ్వరరావుపై తీవ్రంగా స్పందించింది. కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఒక మూలన ఉండాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వ అధికారులు చట్టానికి లోబడి పని చేయాలనీ, రాజకీయ నాయకులకు లోబడి కాదని సీజే రంజన్ గొగోయ్ హితబోధ చేశారు. కోర్టు ఆదేశాలతో ఆటలాడుకోవద్దంటూ హెచ్చరించారు. నాగేశ్వరరావుకు తన 32 ఏళ్ల సర్వీసులో ఎలాంటి మచ్చ లేని అధికారిగా ట్రాక్ రికార్టు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన క్షమాపణలను స్వీకరించాలని సీబీఐ తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ విన్నవించారు. సీబీఐలో ఇటీవల తరచూ తప్పులు జరుగుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే నాగేశ్వరరావు స్వలాభం కోసం బదిలీ చేయలేదని, ఆయన విన్నపాన్ని పరిశీలించాలని కోరారు. అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు.

అనుమతి లేకుండా ముజఫర్‌పుర్ కేసులో దర్యాప్తు చేస్తున్న శర్మను బదిలీ చేయకూడదని సుప్రీంకోర్టు ఇప్పటికే రెండు సార్లు ఆదేశించింది. అయితే నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్ అయ్యాక.. బీహార్‌లో కీలకంగా మారిన ముజఫర్‌పుర్ షెట్లర్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అదనపు డైరెక్టర్ ఏకే శర్మను బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చివరి దశలో ఉండగా పర్యవేక్షణ అధికారిని మార్చడంలో కుట్ర కోణం దాగి ఉందంటూ సామాజిక కార్యకర్త నివేదిత సుప్రీంను ఆశ్రయించారు. ఒక సీనియర్ అధికారి మోడీ పాలన తీరువల్ల కోర్టులో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.