అక్కడ కూడా మోడీ గెలుపు కష్టమే..? చేజారిన మరో రాష్ట్రం..?

పోయినసారి మోడీని అధికారంలోకి తెచ్చింది… బిజెపిని బలమైన పార్టీగా అతిపెద్ద పార్టీగా నిలిపింది ఆ రాష్ట్రమే. ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి ఆ రాస్తారంలోని ముస్లిములు కూడా గంపగుత్తగా ఓట్లేశారు. పోయిన ఎన్నికల్లో ఇదే తీవ్ర చర్చనీయాంశం. అయితే అదే స్టేటులో మోడీని నిలువరించేందుకు సరైన ఎత్తు వేసిన విపక్షాలు విజయం సాధించాయి. ఉప ఎన్నికల్లో, సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాళీ చేసిన సీటులో బీజేపిజ్ ఘోరంగా ఓడించాయి. అదే ఉత్తరప్రదేశ్. మోడీని ఇక్కడ నిలువరిస్తే ఇక ప్రధాని కుర్చీకి దూరం చేయవచ్చని గ్రహించిన ఇక్కడి విపక్షాలు బీఎస్పీ, ఎస్పీలు కూటమి కట్టి ఆ ఉప ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపాయి. ఇప్పుడు మళ్లీ దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని వెనక్కునెట్టి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ సుప్రీం మాయావతి ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలిపాలని నిర్ణయించారు.

‘మోడీ-షా జోడికి ఇక నిద్రలేని రాత్రులు’ తప్పవని అఖిలేష్ యాదవ్, మాయావతి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్‌పీ కూటమిగా ఏర్పడినట్టు శనివారంనాడు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో అఖిలేష్, మాయావతి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ, మాయావతిని అవమానిస్తే తనను అవమానించినట్టేనని, పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎస్పీ-బీఎస్‌పీ కూటమి ఏర్పాటుకు సహకరించిన మాయావతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల బీజేపీ పాలనలో పేదలు, రైతులు, దళితులు, మహిళలు, పిల్లలపై అకృత్యాలు మితిమీరాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, బీజేపీ దురహంకారానికి చరమగీతం పాడేందుకు బీఎస్‌పీ, ఎస్‌పీ చేతులు కలపాల్సిన అనివార్యత ఏర్పడిందని అన్నారు. కార్యకర్తల్లో విభేదాలు సృష్టించేందుకు వాళ్లు (బీజేపీ) ఎంతకైనా తెగిస్తారని, అలాంటి ఎత్తుగడలను సమష్టిగా మనం తిప్పిగొట్టాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. మాయావతిపై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఎస్పీతో పొత్తు ఆలోచన తన మనసులో మెదులుతూనే ఉందన్నారు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి బీజేపీ మంత్రి పదవులిచ్చిందన్నారు. ఎస్‌పీ కార్యకర్తలంతా మాయావతి పట్ల గౌరవంతో మసలుకోవాలని, మాయావతిని అవమానపరిస్తే తనను అవమానపరిచినట్టేనని అఖిలేష్ అన్నారు.

మరోవైపు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ యాదవ్ ఏర్పాటు చేసిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)పై బీఎస్పీ అధినేత్రి మాయావతి నిప్పలు కురిపించారు. శివపాల్ యాదవ్ పార్టీ ‘బీజేపీ ముసుగు పార్టీ’ అని ఆరోపించారు. శివపాల్ యాదవ్, రాజా భయ్యాల వెనుక బీజేపీ ఉండి నడిప్తోందని, ఓట్లను చీల్చేందుకు వారికి డబ్బులు గుప్పిస్తోందని ఆమె ఆరోపించారు.బిశివపాల్ యాదవ్, తదితరులు నడిపిస్తున్న పార్టీ పట్ల ఎస్పీ-బీఎస్‌పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ పార్టీకి బీజేపీ డబ్బులు గుప్పిస్తూ కుట్రకు పన్నాగాలు పన్నుతోందన్నారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ వలలో కార్యకర్తలు చిక్కుకోవద్దని, ఓట్లను చీల్చడం, బీజేపీకి సహకరించడమే వాళ్ల (శివపాల్, రాజాభయ్యా) ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎస్పీ, బీఎస్‌పీ పొత్తులో భాగంగా రెండు పార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తాయని, రెండు సీట్లు చిన్న పార్టీలకు కేటాయిస్తామని చెప్పారు.