అదీ చంద్రబాబు దెబ్బంటే..! దీక్షకు మద్దతు తెలిపిన శివసేన..!

చంద్రబాబు దీక్షకు ఎన్డీఏలోని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ఎన్డీఏలోఉన్న శివసేన కూడా మద్దతు తెలిపింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. అనూహ్యంగా ఆంధ్రభవన్ కు వచ్చి.. చంద్రబాబు దీక్షకు సంఘిభావం తెలిపారు. నరేంద్రమోడీ… ఏపీకి అన్యాయం చేశారని… స్పష్టం చేశారు. బీజేపీ కూటమిలో లేని పార్టీలు దాదాపుగా అన్నీ వచ్చినప్పటికీ… ఎన్డీఏలో ఉన్న పార్టీ శివసేన రావడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. భారతీయ జనతా పార్టీ నేతలు నరేంద్రమోడీ, అమిత్ షా వ్యవహారశైలిపై… శివసేన చాలా కాలంగా కోపంగా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. శివసేనను ఎలాగోలా మచ్చిక చేసుకుని ఎన్డీఏలో ఉండేలా చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ శివసేన మాత్రం.. బీజేపీకి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తూనే ఉంది.

తెలుగు రాష్ట్రాల నుంచి మూడు పార్టీలు.. చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలియచేయలేదు. ఏపీ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్, మజ్లిస్ కు చెందిన నేతలెవరూ ఏపీ భవన్ వైపు రాలేదు. టీఆర్ఎస్ కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. మిగతా పార్టీలన్నీ.. కాంగ్రెస్ తో దగ్గరగా వ్యవహరిస్తున్నాయి. పొత్తులు పెట్టుకోకపోయినప్పటికీ.. ఆ పార్టీలన్నీ బీజేపీనే ప్రథమ ప్రత్యర్థిగా భావిస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ సంబంధాలు భిన్నం. దానికి ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఉంటే.. ఎలాంటి ఇబ్బందులు రావని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది. అందుకే ఫెడరల్ ఫ్రంట్ వైపే మొగ్గు చూపిస్తోంది. మరో వైపు .. మజ్లిస్ పార్టీ.. ఇటీవలి కాలంలో… బీజేపీ కంటే కాంగ్రెస్ నే ఎక్కువగా విమర్శిస్తోంది. ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నారు.

ఆయన కేసీఆర్ తో పాటే నడిచే అవకాశం ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఏపీ చేపట్టిన నిరసన వైపు ఆయన కన్నెత్తి చూడలేదు. తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కాబట్టి ఏ రూపంలోనూ.. టీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు తెలుపదు. ఇక వైసీపీకి .. కేంద్రంలో ఉన్న పార్టీతో.. జగడం పెట్టుకోవడం.. అదీ బీజేపీతో పెట్టుకోవడం అంటే.. జీవన్మరణ సమస్య లాంటిది. కాబట్టి.. అసలు అవకాశం లేదు. అందుకే.. ఈ రెండు పార్టీలు ఎన్నికల తర్వాత అయినా బీజేపీ వైపే చూస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ విషయంలో ఢిల్లీలో కొంత సందేహం ఉండేది.. చంద్రబాబు దీక్షతో అదీ జాతీయ మీడియా వర్గాలకు దీనిపైనా క్లారిటీ వచ్చినట్లయింది.