రూటు మార్చిన జేసీ.. ఓటమి దెబ్బకు ఏం చేస్తున్నాడో చూడండి

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ట్రెండ్‌ మార్చారు. తనయుడు ఓటమితో ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గా ఆయన పుట్టినరోజు వేడుకలు అద్దం పట్టాయి. స్థానిక నివాసంలో శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ 66వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో నిరాడంబరంగా జరిగేవి. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అధికారులు, అనధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమవెంట పూలదండలు, స్వీట్లు, కేక్‌లు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చును విరాళాల రూపంలో ఇవ్వాలని కోరేవారు.

ఇందుకోసం స్థానిక నివాసంలో ప్రత్యేకంగా హుండీని ఏర్పాటు చేసేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన డబ్బులను లెక్కిస్తే దాదాపు రూ.5 లక్షల వరకు ఉండేది. ఈ మొత్తాన్ని దేవాలయాల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు, పేదవిద్యార్థుల ఆర్థిక సాయం తదితర వాటికి ఉపయోగించేవారు. కానీ శనివారం జరిగిన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఆయన తనశైలికి స్వస్తి పలికారు. వచ్చిన అధికారులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తల నుంచి పూలదండలు వేయించుకున్నారు. కేక్‌ కటింగ్‌లు చేశారు. ఈ పరిణామానికి సొంతపార్టీ నాయకులే ఆశ్చర్యపోయారు. దీన్నిబట్టిచూస్తే ఆయనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ స్థాయిలో మనస్తాపానికి గురిచేశాయోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మాజీ ఎమ్మెల్యే జేసీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని పెద్దఎత్తున జనాలు తరలివచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంతో పాటు శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, యల్లనూరు మండలాలకు చెందిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరై పుష్పగుచ్ఛాలు, పూలమాలలతో శుభాకాంక్షలు తెలిపారు. వీరి రాకతో జేసీ నివాసంతో పాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. పెద్దఎత్తున బాణాసంచా పేల్చి కార్యకర్తలు, నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పుట్టినరోజు వేడుకలకు వచ్చిన 3వేల మందికి శాఖాహార, మాంసాహార విందు భోజనాన్ని ఏర్పాటుచేశారు. అంతకుమునుపు కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే జేసీ కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా తండ్రికి జేసీ అశ్మిత్‌రెడ్డి కేక్‌ తినిపించారు.

కేక్‌ కటింగ్‌లో జేసీ అల్లుడైన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మనవళ్లు విరాజ్‌రెడ్డి, విక్రాంత్‌రెడ్డి, ధీర్‌దివాకర్‌రెడ్డి, మనవరాళ్లు ఐహికారెడ్డి హాజరై సంబరాలు చేశారు. ఉదయం 9గంటల సమయంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జిలాన్‌బాషా, మార్కెట్‌యార్డు చైర్మన్‌ వేలూరు రాజశేఖర్‌నాయుడు, రాష్ట్ర బీసీ కార్యవర్గ సభ్యులు డీవీ కుమార్‌, మండల కన్వీనర్‌ జగన్నాథరెడ్డి తదితరులు ఎమ్మెల్యే చేత కేక్‌ కట్‌ చేయించి పూలమాలలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు.