రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజు.. చరిత్రలో మొట్టమొదటి సారి

వైసీసీ బాధితులకు అండగా తాను పిలుపునిచ్చిన ‘చలో ఆత్మకూరు’ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన ట్విటర్‌ ఖాతాలో బుధవారం రాత్రి ఆయన స్పందించారు. ‘వైసీపీ ప్రభుత్వ బాధితులకు సంఘీభావంగా నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు. ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. టీడీపీ నేతలకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లలో నిర్భంధించారు. మహిళలను, ఎస్సీ, బీసీ నేతలను అనేక పోలీస్‌ స్టేషన్లకు తిప్పడం ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని, ఇంత ఫాసిస్ట్‌ పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. వేలాది మందిని నిర్భంధించడం గర్హనీయమని, రాష్ట్రం రావణ కాష్టం అయిందని ఆయన విమర్శించారు.

తాను పిలుపు ఇచ్చేవరకూ వైసీపీ బాధితులను గ్రామాలకు తీసుకువెళ్లలేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పని ముందే ఎందుకు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ‘మేం యుద్ధం చేయడానికి ఆందోళనలు చేయలేదు. బాధితులకు న్యాయం కోరుతూ ఆందోళన చేపట్టాం. వారు గ్రామాలు వదిలిపెట్టి వంద రోజులైంది. శిబిరంలోకి వచ్చి తొమ్మిది రోజులైంది. ఇప్పటిదాకా ఏ చర్యలూ తీసుకోలేదు. ‘చలో ఆత్మకూరు’కు మేం సిద్ధమైన తర్వాత ఇప్పుడు హడావుడిగా వారిని తీసుకువెళ్లారు. బలవంతంగా తీసుకువెళ్లడం వల్ల రేపు వారికి ఏదైనా సమస్య వస్తే దానికి పోలీస్‌ శాఖ బాధ్యత వహించాలి. మేం వారికి భరోసా ఇవ్వడానికి ఈ ఆందోళన చేపట్టాం. ఉద్రిక్తతలు పెంచడానికి కాదు. నేను వెళ్తే ఆ గ్రామంలో ఉద్రిక్తతలు పెరుగుతాయని డీజీపీ అనడం హాస్యాస్పదం.’’ అని అన్నారు.అంతా అయ్యాక తీరిగ్గా నోటీసు: చంద్రబాబు గృహ నిర్భంధం విషయంలో పోలీసులు పప్పులోకాలేశారు. ఆ పార్టీ చేపట్టిన ఆందోళన అంతా ముగిసిపోయిన తర్వాత తీరిగ్గా అప్పుడు ఆయనను గృహ నిర్భంధంలో ఉంచుతున్నట్లు నోటీసు పంపారు. ఆ నోటీసు ప్రతిని బుధవారం రాత్రి ఆయన ఇంటికి అంటించడం వివాదాస్పదంగా మారింది. ఈ నోటీసుపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఈ నోటీసును ఉదయం ఏడు గంటలలోపు ఇవ్వాలి. 12 గంటల నిర్భంధం తర్వాత ఇవ్వడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.

"
"