రాఫ్తాడులో సంచలనం..! బరిలోకి శ్రీరామ్..!?

దివంగత నేత పరిటాల రవీంద్ర, మంత్రి సునీత కుమారుడు శ్రీరామ్‌ను వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలో నిలపాలని కుటుంబీకులు భావిస్తున్నారు. అమరావతిలోనే ఉండి శ్రీరామ్‌కు ఏదో ఒక స్థానం నుంచి అభ్యర్థిత్వం ఖరారు చేయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే తరుణంలో పరిటాల శ్రీరామ్‌ను బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కళ్యాణదుర్గం, పెనుకొండ అసెంబ్లీ స్థానాలు లేదా హిందూపురం పార్లమెంట్‌ స్థానం నుంచి టిక్కెట్‌ ఆశించారు. అయితే అధినేత చంద్రబాబు పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, హిందూపురం పార్లమెంట్‌ స్థానం నిమ్మల కిష్టప్పకు ఖరారు చేశారు.శ్రీరామ్‌ కళ్యాణదుర్గంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత సురేంద్రబాబుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీరామ్‌కు ఎక్కడి నుంచి అవకాశం ఉంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం నుంచి శ్రీరామ్‌ను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను అధినేత వద్దకు తీసుకెళ్లేలా పలువురు కీలక నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. రాప్తాడులో మంత్రి సునీతను కాదని, శ్రీరామ్‌ను బరిలోకి దించే ప్రతిపాదనపై అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు జేసీ సోదరుల కుమారులు ఇద్దరు ఈసారి పోటీ చేయనున్నారు. దీంతో శ్రీరామ్‌ను కూడా ఎలాగైనా బరిలో దించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

భవిష్యత్ రాజకీయాల కోసమైనా… శ్రీరామ్‌ను బరిలోకి దింపాలని… పరిటాల సునీత చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం… శ్రీరామ్ అయితే.. మంత్రి పదవి ఇవ్వడం ఇబ్బందికరం అవుతుందని… సునీత అయితే సీనియర్ గా ఎవరికీ అభ్యంతరాలు ఉండవని గుర్తు చేస్తున్నారు. వచ్చే ప్రభుత్వంలో మంత్రి పదవి కోసం పట్టుబట్టకపోతే.. చంద్రబాబు శ్రీరామ్ కు చాన్సిచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎలాగైనా సరే… ఈ సారి పరిటాల శ్రీరామ్ ను బరిలోకి దింపాలనే పట్టుదలతో.. సునీత ఉన్నారు. మరి చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.