రాపాక… కోటంరెడ్డి… ఇదేమి పోలీస్… విరుచుకుపడ్డ లోకేష్

విలేకరిపై దాడి చేసినట్లు…. కిడ్నాప్ చేసినట్లు కేసు నమోదైన వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వదిలేసిన పోలీసులు తమ కార్యకర్త కోసం స్టేషన్ కి వెళ్లిన విపక్ష ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని అరెస్ట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాపాక అరెస్ట్ విషయంలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహం చివరకు కోర్టు ఆగ్రహానికి కారణం అయ్యింది. ఈ వ్యవహారం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. రాపాక వరప్రసాద్ అరెస్ట్ అన్యాయమంటూ చెప్పుకొచ్చారు.

ఒక పత్రికా విలేఖరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం ప్రజల తరపున ప్రశ్నించిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయిస్తోందంటూ విరుచుకుపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం ఘటనలో ప్రజల తరపున ప్రశ్నించినంత మాత్రాన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని అరెస్టు చేసిందని అభిప్రాయపడ్డారు. అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చు. ప్రతిపక్షం మాత్రం న్యాయమడిగినా తప్పా? ఏమిటీ నియంతృత్వం? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు.ఇకపోతే తనపై నమోదైన కేసుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మలికిపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. రాపాకను అరెస్ట్ చేసిన పోలీసులు రాజోలు కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ పై కోర్టు పోలీసులకు అక్షింతలు వేసింది. ఈ కేసు తమ పరిధిలోకి రాదని కోర్టు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని పోలీసులకు సూచించింది. అంతేకాకుండా రాపాకకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేశారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.