రామ్మోహన్ నాయుడు… గ‌ల్లా జ‌య‌దేవ్‌కు ల‌క్కీ ఛాన్స్‌…!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాజకీయంగా బలపడాలి… లక్షలాది మంది కార్యకర్తల బలం ఉన్న ఆ పార్టీ వారిని ధైర్యంగా ముందుకి నడిపించాలి అంటే సమర్ధవంతమైన నాయకత్వాన్ని వాళ్ళ ముందు నిలబెట్టాలి. ఇప్పుడు ఆ పార్టీకి యువ నాయకుల అవసరం ఎంతో ఉంది. రాజకీయంగా వారిని ఆ పార్టీ ముందుకి నడిపించే విధంగా ప్రోత్సహించాలి… వారికి అవకాశాలను ఇవ్వాల్సి ఉంటుంది. సీనియర్ నేతల సలహాలను తీసుకుంటూ యువనేతలను ముందు ఉండి నడిపిస్తేనే యువతలో ఒక క్రేజ్ వస్తుంది.ప్ర‌స్తుతం తెలుగుదేశం అలా చేయలేకపోతుంది అనే ఆరోపణలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి.

ఇక ఈ తరుణంలో బయటకు వచ్చిన కొన్ని వార్తలు ఆ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నాయి. పార్టీకి చెందిన యువ ఎంపీలు గల్లా జయదేవ్ కి, రామ్మోహన్ నాయుడు కి పార్టీలో కీలక పదవులు ఇవ్వడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నార‌ట‌.ఇటీవల రామ్మోహన్ నాయుడు కి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పదవిని చంద్రబాబు అప్పగించారు. ఇక ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే ఆలోచన చేస్తున్నారట. యువతలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. ఓ వైపు జ‌మిలీ ప్ర‌చారం ఉన్న నేప‌థ్యంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి ఆయనకు ఆ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక గల్లా జయదేవ్ కి కూడా చంద్రబాబు కీలక పదవి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారట.గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన బాధ్యతలను ఆయనకు అప్పగించే ఆలోచనలో ఉన్నారట.

ఆ జిల్లాల పార్టీ బాధ్యతలు అన్నీ కూడా ఆయనే చూస్తారని సమాచారం. త్వరలోనే దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా బాధ్యతలను కూడా ఆయన చూస్తారని సమాచారం. ఇక లోకేష్ ని జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పిస్తారని అంటున్నారు.