రాజ‌మండ్రి సిటీ టీడీపీదే… గెలుపు భ‌వానీదే

విధేయ‌త‌కు ప‌ట్టం క‌డుతున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఈ క్ర‌మంలోనే కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న కుటుంబాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి వారికి కోర‌కుండా టికెట్లు ఇస్తూ.. వారిని అభివృద్ధిలోకి తీసుకు వ‌స్తున్నారు. ప్ర‌ధానంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, టీడీపీ వాయిస్‌ను బ‌లంగా వినిపించిన దివంగ‌త ఎర్ర‌న్నాయుడు కుటుంబానికి చంద్ర‌బాబు ఫ‌స్ట్ ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఎర్ర‌న్నాయుడు మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న కుమారుడు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడుకు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చి గెలిపించుకున్నారు.

అదేస‌మ‌యంలో రామ్మోహ‌న్‌కు రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంటులో మాట్లాడే ఛాన్స్ ఇచ్చి .. యువ నాయ‌కుడిగా ఆయన ను ప్రోత్స‌హించారు. ఇక‌, ఇప్పుడు ఇదే కుటుంబానికి చెందిన ఎర్ర‌న్నాయుడు కుమార్తె, తూర్పుగోదావ‌రికి చెందిన టీడీపీ ఫ్యామిలి ఆదిరెడ్డి అప్పారావు కోడ‌లు ఆదిరెడ్డి భ‌వానీకి కూడా చంద్ర‌బాబు పెద్ద‌పీట వేశారు. అనూహ్యంగా ఆమె పేరును రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెర‌మీదికి తెచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తులో భాగంగాదీనిని బీజేపీకి ఇచ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు స్వ‌తంత్రంగా పోటీ చేస్తున్న నేప‌థ్యంలో ఆదిరెడ్డి భ‌వానీ పేరును రాజ‌మండ్రి న‌గ‌ర నియోజ‌క‌వ‌ర్గానికి ఎంపిక చేశారు.

ఇక‌, చంద్ర‌బాబు త‌న‌కు టికెట్ కేటాయించ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. ఇక, నామినేష‌న్ వేయ‌డంతోపాటు విస్తృతంగా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు కూడా ఆమెస‌న్నాహాలు చేసుకుంటున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న పుట్టిల్లు, మెట్టినిల్లు కూడా ఆమెకు అండ‌గా ఉంటున్న నేప‌థ్యంలో ఆమెగెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా మ‌హిళా సెంటిమెంట్ కూడా బాగానే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాలు భ‌వానీకి క‌లిసి రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందుగానే రాజ‌మండ్రి సిటీ టికెట్ టీడీపీ ఖాతాలో చేరిపోయింద‌ని అంటున్నారు.