సర్వత్రా ఉత్కంఠ.. రాజధాని పై జగన్ మనసులో ఏముంది

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ విజయదుందుభి మోగించి, కొద్ది రోజుల్లోనే అధికారపీఠాన్ని అధిష్ఠించనున్నవేళ రాజధాని అమరావతి విషయమై చర్చ తెరపైకి వచ్చింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అప్పగించిన రైతులు ఈ విషయంలో మరింత ఆసక్తిని కనపరుస్తున్నారు. వారు అప్పగించిన భూముల్లో ప్రస్తుతం ఏదో మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ భూముల్లోనే తాత్కాలిక సచివాలయం కొలువు తీరి ఈ ఐదేళ్లుగా పరిపాలన సాగిస్తోంది.

ఈ ఏడాదే తాత్కాలిక హైకోర్టు రూపుదిద్దుకొంది. శాశ్వత న్యాయస్థానం నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. పలు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలు, హోటళ్లు, కనెన్షన్‌ సెంటర్లు, షాపింగ్‌మాల్స్‌, వాణిజ్య సంస్థలు వచ్చాయి. ఒకనాడు పూర్తిగా వ్యవసాయానికి పరిమితమయిన ఈ ప్రాంతాల్లో కొత్త కోణాల్లో ఆర్థిక కదలికలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తారా..పరిపాలన ఇక్కడ నుంచే సాగుతుందా.. నిర్మాణాలు పూర్తిచేసుకొన్న సంస్థలు, పాలనా కార్యాలయాలను మాత్రం ఇక్కడే ఉంచి, మిగతా వాటిని కొత్త ప్రాంతానికి తరలిస్తారా అనే విషయంలో రాజధాని రైతులు స్పష్టత కోరుకొంటున్నారు. ఈ విషయంలో కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనలను తెలుసుకోడానికి వారు ఆసక్తి చూపుతున్నారు. రాజధానిగా అమరావతిని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించడాన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ తీవ్రంగా వ్యతిరేకించారన్న వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అందులో వాస్తవమెంతో తెలియదుగానీ భూసమీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని మాత్రం ఆయన పలు సందర్భాల్లో ఆరోపించారు. అలాగే రాజధాని నిర్మాణ తీరును తప్పుబట్టి, దానిపై తాము రాగానే విచారణ జరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్‌ ప్రకటించారు. అయితే, ఎక్కడా ఆయన రాష్ట్ర రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయడానికి తాను వ్యతిరేకమని విస్పష్టంగా చెప్పిన దాఖలాలు మాత్రం లేదు. అయితే, వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి, ఆయన ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో మాత్రం విస్తృతంగా సాగుతోంది. ఈ అస్పష్టతకు తెర దించేలా జగన్‌ ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని రాజధాని రైతులు ఆకాంక్షిస్తున్నారు.

అమరావతిపై జగన్‌ మనసులో ఏముందో తెలుసుకోవడంతోపాటు ముఖ్యమంత్రి అయితే రాజధానిని ఇక్కడి నుంచి తరలించబోనంటూ ఆయన నుంచి హామీ పొందేందుకు రాజధాని రైతులు గతంలో పలు ప్రయత్నాలు చేశారు. జగన్‌ ఈ ప్రాంతానికి ‘ప్రజాసంకల్ప యాత్ర’లో భాగంగా వచ్చినప్పుడు, ఇతర సందర్భాల్లోనూ వారు ఆయనను కలుసుకొన్నారు. ఎన్నికల బహిరంగసభల్లో ఆయన స్పష్టత ఇస్తారేమోనని ఎదురుచూశారు. కానీ, జగన్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోలేకపోయారు.