ప్రవీణ్ ప్రకాశ్ సంచలన లేఖ.. అందరిని అడ్డంగా ఇరికించేసాడుగా..?

ఏపీలో ఇప్పుడు లెనంత విధంగా ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయంలో తన అధికారాన్ని వాడుతున్నాడు. ఇప్పుడు అయన రాసీన లేఖ సంచలనాలకు దారి తీస్తుంది.సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తాజా నిర్ణయం ఆర్థికశాఖను, సీనియర్‌ ఐఏఎ్‌సలను ఇరుకున పడేసింది. తనకింద పనిచేసే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాకే తనకు ఇవ్వాలంటూ ఆయన రాసిన లేఖ సీఎంవోతో పాటు ఆర్థిక శాఖను ఆత్మరక్షణలోకి నెట్టింది. సకాలంలో వేతనాలు అందించడం లేదన్న విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టడంతో పాటు మిగతా శాఖల అధికారులను కూడా ఇందులో ఇరికించినట్లయిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తన చర్యతో ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉద్యోగుల విషయంలో మంచి అనిపించుకుంటారేమో కానీ, ఇతర శాఖల అధికారులను వారికింద పనిచేసే ఉద్యోగుల విషయంలో వేలెత్తి చూపించేలా చేశారని సీనియర్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు.ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరితే సబబుగా ఉండేదని, అలాకాకుండా వారికి వేతనాలు చెల్లించాకే చివరగా తనకు ఇవ్వాలంటూ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వడం ద్వారా సరికొత్త పంచాయతీకి తెర తీశారనిఅంటున్నారు. చివరకు ఈ విషయంలో సీఎం ఏం చేస్తారన్న ప్రశ్నాత్మక చర్చకు దారితీసినట్లయిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్ర ఆర్థిక కష్టాల నేపథ్యంలో రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం కష్టమవుతోంది. పెన్షన్ల విడుదల కూడా ఆలస్యమవుతోంది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఒక్క సాధారణ పరిపాల శాఖకే పరిమితం కాలేదు. సీఎంఓ, ఆర్థిక, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ వంటి అనేక శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే వేతనాల చెల్లింపు సమస్య ఒక్క జీఏడీలోనే ఉన్నట్లుగా భావించినట్లుగా ఉందని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అభిప్రాయపడ్డారు. నిజానికి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి ఇన్‌చార్జి మఖ్యకార్యదర్శి. అంతకన్నా మందు ఆయన సీఎంకు ముఖ్యకార్యదర్శి. ఈ హోదాలో మొత్తం అన్ని శాఖల పరిధిలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విషయంలో ఆయన ఇదే ఔదార్యం చూపించి ఉంటే ఇంకా బాగుండేదని సీనియర్‌ ఐఏఎ్‌సలు చెబుతున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ వారికి సకాలంలో వేతనాలు అందించాలని ఆర్థికశాఖను కోరినా, సీఎంతో ఉత్తర్వులు ఇప్పించినా ఆయన ఔదార్యం, మంచితనం మరింతగా వెలుగులోకి వచ్చేవంటున్నారు. ‘నిధులు సిద్ధంగా ఉంటే వేతనాల చెల్లింపు సకాలంలో జరిగిపోతుంది. ఆలస్యమవుతోందంటే ఆయన చెప్పిన కారణాలే కాదు… నిధుల సమస్య కూడా గమనించాలి. ఆయన జీఏడీ బాధ్యతలు మాత్రమే చూస్తే ఆయన చేసిన పనిని అభినందించి, సన్మానం చేయాలి.

కానీ సీఎం ముఖ్యకార్యదర్శి హోదాలో ఆయన అన్ని ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేయించాలి. జీతాల చెల్లింపు విషయంలో మాకూ బాధ్యత ఉంది. అది మా చేతుల్లో ఉంటే ముందుగా వారికి చెల్లించిన తర్వాతే మేం తీసుకుంటాం. సకాలంలో బిల్స్‌ పంపించిన తర్వాత కూడా వేతనాలు రావడం లేదు. దీనికి ఎవరిని తప్పుపట్టాలి? సమస్యకు మూలాలు కనిపెట్టి పరిష్కరించాలి. అంతేకానీ జీఏడీ ముఖ్యకార్యదర్శిగా నేను ఈ పనిచేశాను. మిగతా వారేమిటో తేల్చుకోవాలి… అని పరోక్షంగా అందరినీ ఇరికించినట్లుగానే ఉంది. మేం కూడా ఆయనలాగా నిర్ణయం తీసుకుంటే ఉత్తములం. లేదంటే చెడ్డవాళ్లమా?’’ అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వేతనాల చెల్లింపు ఒక శాఖ సమస్య కాదని, దీన్ని మొత్తం ఉద్యోగులదిగా గుర్తించి వెంటనే పరిష్కరించాలని మరో సీనియర్‌ అధికారి కోరారు.