ప్రజా తిరుగుబాటు తప్పదు… చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని ఈ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పేలా లేదని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు హితవు పలికారు. ప్రజల స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మంగళవారం విజయవాడలో జరుగుతున్న టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచి పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర పోషిద్దామనుకున్నామని, కానీ ప్రభుత్వం అరాచకంగా ప్రవర్తిస్తున్నందున పోరాటబాట తప్పదన్నారు. ప్రజావ్యతిరేక పాలనపై పోరాటానికి కార్యచరణ రూపొందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల పంచాయితీలు జరగనివ్వమని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ దాడులపై పోలీసులు అనుసరిస్తున్న విధానం సరికాదన్నారు. స్పీకర్‌ తన హుందాతనాన్ని కాపాడుకోవాలన్నారు.

మంచి నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, అందులో భాగంగానే 370 రద్దుకు మద్దతు పలికామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ నిలిపివేశారని, ఇసుక ధర పెంచి వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రూపాయి కూడా ఖర్చు లేకుండా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు చేపట్టామని, అమరావతి నిర్మాణాన్ని ఆపేశారని, హైదరాబాద్ భూములకు బూమ్ వచ్చిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో రోజూ విమానాలు పెరుగుతుంటే.. అమరావతిలో రెండు నెలల్లో 20 విమానాలు రద్దయ్యాయన్నారు.విజయవాడ నుంచి విశాఖ వెళ్లాలంటే… పక్క రాష్ట్రం మీదుగా వెళ్లే పరిస్థితి తెచ్చారని, నగరాల మధ్య విమానాల కనెక్టివిటీ లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ నుంచి శ్రీశైలానికి గోదావరి నీళ్లు తీసుకెళ్తామనడం అన్యాయమని, జగన్‌, కేసీఆర్‌లు ఆంధ్రాకు అన్యాయం చేసే ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గోదావరి జలాల తరలింపు ఇద్దరు సీఎంలకు సంబంధించిన విషయం కాదన్నారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీని దారుణంగా నడిపిస్తోందని, మేం 150 మంది సభ్యులం ఉన్నామంటూ బెదిరిస్తున్నారని, మేం లేస్తే ఒక్కరు కూడా మిగలరంటూ హెచ్చరిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో జగన్‌ పులివెందుల పంచాయితీ చేస్తానంటే జరగనివ్వనని, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని, ఇప్పటికైనా అరాచకాలు ఆపాలని చంద్రబాబు సూచించారు.

జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారన్నారు. వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వం ప్రజాధనం ఖర్చు చేస్తోందని విమర్శించారు. టీడీపీ కోన్‌ కిస్కా గొట్టంగాళ్లకు భయపడొద్దని స్పీకరు తమ్మినేని సీతారాం అంటున్నారని, స్పీకర్‌ స్థాయిని దిగజార్చొద్దని చంద్రబాబు ఆయనకు సూచించారు. వైసీపీ ఇసుకపై తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరత సృష్టించి.. ధరలు విపరీతంగా పెంచేశారని, చివరికి సిమెంట్ కంటే ఇసుక ధర ఎక్కువైందని విమర్శించారు. ఇసుక ధర ఇంతగా పెరగడానికి ఎవరు కారణమో జగన్‌ చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.