టీడీపీ మాజీ లేడీ మంత్రి పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డే…!

తెలుగుదేశం పార్టీలో గత నాలుగేళ్లలో అందివచ్చిన లక్కీ ఛాన్స్‌ను చేజేతులా కాలతన్నుకున్న వారిలో మాజీ మంత్రులు రావెల కిషోర్‌ బాబు, కిమిడి మృణాళిని ముందు వరసలో ఉంటారనడంలో సందేహం లేదు. గత ఎన్నికలకు ముందు ప్రత్తిపాడులో రావెల కిషోర్‌బాబుకు టీడీపీ సీటు దక్కడం, ఇటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కిమిడి మృణాళినీకి బీఫామ్‌ వస్తుందని వాళ్లే ఊహించి ఉండరు. ఎక్కడో ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌గా ఉన్న రావెల కిషోర్‌ బాబుకు చంద్రబాబు అనూహ్యంగా పిలిచి సీటు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళినీకి సైతం చంద్రబాబు చివరిలో సామాజిక సమీకరణల నేపథ్యంలో చీపురుపల్లి సీటు ఇచ్చారు. అయితే టీడీపీ గాలిలో వీరిద్దరూ విజయం సాధించారు. ఈ ఇద్దరి గెలుపులో పార్టీ ప్రభావమే గాని వారి వ్యక్తిగత ఇమేజ్ శూన్యాతి శూన్యం. పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంటే అటు ప్రత్తిపాడులోగాని ఇటు చీపురుపల్లిలోగానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్పట్లో అధికార పార్టీ వాళ్లు పెట్టిన అరాచకాలు తట్టుకుని ఎన్నో కష్టనష్టాలకు, వ్య‌య ప్ర‌యాస‌లకు ఓర్చి నియోజకవర్గంలో పార్టీని బ్రతికించారు.

అయితే ఎన్నిక‌ల ముందు స్థానిక కేడ‌ర్ అభీష్టానికి వ్యతిరేఖంగా చంద్రబాబు రావెల,మృణాళినీకి సీటు ఇచ్చినా పార్టీపై ఉన్న వీరాభిమానంతో వారిద్దరిని గెలిపించుకున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు సామాజిక సమీకరణల్లో వీరిద్దరికి మంత్రి పదవులు కేటాయించారు. కష్టపడినవాడికి ఫలితం విలువ తెలుస్తుందిగాని తేరగా పదవి వస్తే వాళ్లకు సుఖం విలువ తెలుస్తుందిగాని ఆ పదవి రావడానికి వేలాదిమంది కార్యకర్తలు పడిన బాధ విలువ ఎలా తెలుస్తుందన్నది వీరిద్దరూ రుజువు చేశారు. మంత్రి పదవులు వచ్చిన ఆరు నెలలకే వీరిద్దరి అసలు రూపం బట్ట బయలు అయ్యింది. ఫలితంగానే గత ఏడాది జరిగిన కేబినెట్‌ ప్రక్షాళ‌న‌లో వీరిద్దరిని నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తప్పించారు. ఇక రావెల తాజాగా టీడీపీని వీడి జనసేనలోకి జంప్‌ చేసేశారు. ఇక ఇప్పుడు మృణాళినీ వంతు వచ్చింది. మృణాళినీని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు …చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పదేళ్ల పాటు కష్టపడినందుకు దక్కిన బహుమానం ఏంటంటే నియోజకవర్గంలో టీడీపీని పాతాళానికి భూస్థాపితం చెయ్యడమే.

నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నిలువునా బ్రష్టు పట్టించడం మినహా ఆమె వల్ల పార్టీకి ఏ మాత్రం మైలేజ్‌ రాలేదంటే నాలుగున్నర ఏళ్లలో అక్కడ పార్టీ ఎంత దయనీయ స్థితికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే మంత్రి పదవి వచ్చాక మృణాళినీ మనది ఈ నియోజకవర్గం కాదు, ఈ ఐదేళ్లు ఉంటాం ఆ తర్వాత ఇక్కడ ఎవరు ఎలా ఉంటే మాకే, పార్టీ నాశనం అయినా మాకేంటి అన్న చందంగానే మృణాళినీ అండ్‌ ఫ్యామిలీ రాజకీయం చేసిందని నియోజకవర్గ టీడీపీ శ్రేణులే నిర్వేదంతో తమ బాధను వెల్లగ‌క్కుతున్నాయి. స్థానికురాలు కాకపోవడం, ఏ మాత్రం కష్టపడకుండా పదవులు అనుభవించడంతో పార్టీ ఎలా పోయినా నాకేంటి అన్న చందంగానే ఆమె నాలుగున్నర ఏళ్ల పాటు చీపురుపల్లిలో రాజకీయం చేసినట్టే తెలుస్తోంది. మృణాళినీ పని తీరుపై ఆరు నెలలకే చంద్రబాబుకు క్లారిటీ రావడంతో అప్పటికప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకోకపోయినా అందుకే గత ఏడాది జరిగిన కేబినెట్‌ ప్రక్షాళ‌న‌లో అమెను పక్కన పెట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఖ‌చ్చితంగా వేటు పడే సిట్టింగ్‌ ఎమ్మెల్యేల లిస్టులో మృణాళినీ టాప్‌ టెన్‌ లిస్ట్‌లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదన్న విషయంపై మృణాళినీకి క్లారిటీ వచ్చినట్లుంది. ఈ క్రమంలోనే మృణాళినీతో పాటు ఆమె భర్త కిమిడి గణపతిరావు తమ వారసుడికి చీపురుపల్లి సీటు ఖాయమని… ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చారని డబ్బా కొట్టుకుంటున్నట్టు నియోజకవర్గ టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తప్పు చేశామా.. మద‌న పడుతున్న చీపురుపల్లి శ్రేణులు..!
అసలు గత ఎన్నికల్లోనూ నియోజకవర్గానికి ముక్కు, మొహం తెలియని, తమ జిల్లానే కాని స్థానికేత‌రురాలు అయిన మృణాళినీని గెలిపించుకుంటే, చంద్రబాబు మంత్రి పదవి ఇస్తే ఆమె పార్టీని సర్వనాశనం చేసారని చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తీవ్రమైన ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరో సారి నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తులకు లేదా మృణాళినీ ఫ్యామిలీకి సీటు ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని వారంతా తెగేసి చెబుతున్నారు. గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాట్లు ఇప్పుడు మరో సారి చెయ్యమని వారంతా ఘంటా పథంగా చెబుతున్నారు. ఎంత దారుణం అంటే మృణాళినికి చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో చాలా మంది ఎంపీటీసులు, స్థానిక సమస్థల ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన కీలక నాయకుల పేర్లు కూడా తెలియవట.

దీనిని బట్టీ ఆమెను అక్కడ నాలుగున్నర ఏళ్లలో ఎంత గొప్ప రాజకీయం చేసిందో అర్థం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి టీడీపీ సీటును స్థానికంగా కేడర్‌లో పట్టున్న వారికి ఇస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు సులువు అవుతుందని లేకపోతే పార్టీ అధినేత చంద్రబాబే సీటును బంగారు పల్లెంలో పెట్టి వైసీపీకి అప్పగించినట్లు అవుతుందని వారు చెబుతున్నారు. ఏదేమైన మాజీ మంత్రిగా మృణాళినీ పొలిటికల్‌ కెరియర్‌ దాదాపు క్లోజ్‌ అయినట్టే టీడీపీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఫైన‌ల్‌గా చీపురుపల్లి సీటు విషయంలో చంద్రబాబు గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు పున‌రావృతం కాకుండా ఈ సారి ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటారో చూడాల్సి ఉంది.