పోలవరంపై ఢిల్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు…?

కాబోయే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు దానికోసం ఒక రోజూ కేటాయించి సమీక్షలు చేసి పనులు పరుగులెత్తించిన సంగతి తెలిసిందే. కేంద్రం చేతిలో ప్రాజెక్ట్ పెడితే అది వేగవంతంగా జరగదన్న ఉద్దేశంతో తానే దగ్గరుండి ఆ పనులు పర్యవేక్షించారు. అయితే తాజాగా జగన్ మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సాయం తీసుకుంటామని చెప్పారు. అవసరం అయితే మళ్ళీ టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. “పోలవరం ప్రాజెక్ట్‌ పరిస్థితిని సమీక్షించి మళ్లీ టెండర్లు పిలవాలంటే పిలుస్తాం. కచ్చితంగా పలానా టైమ్‌లోపు పూర్తి కావాలని చెబుతాం.

అవసరమైతే కేంద్రం జోక్యం కోరుతాం. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాపై స్పష్టంగా చెప్పింది. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదు అనే వాదన సరికాదు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలి’’ అని జగన్‌ అన్నారు. ఇక తన తండ్రి వైఎస్ పాలనపై కూడా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా తాను పరిపాలనలో వేలు పెట్టలేదని వైఎస్ జగన్‌ అన్నారు. సచివాలయంలో అడుగు కూడా పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో మోదీ, అమిత్ షా కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘అసలు నేను అప్పుడు హైదరాబాద్‌లో కూడా లేను. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు అందుకే వైసీపీకి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారని జగన్ అన్నారు.ఏపీలో చాలా కుంభకోణాలు జరిగాయని జగన్ అన్నారు. శాఖల వారీగా రివ్యూలు చేసి అన్నింటిని బయటపెడతానన్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పి భూములు తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి తర్వాత రాజధాని ప్రకటించారని జగన్‌ తెలిపారు. ముందుగా భూములు కొనడంతో ఆగలేదని, ల్యాండ్‌పూలింగ్‌ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చిన ధరకు భూములు కొన్నారని, రాజధాని భూముల బాగోతం ఓ సంచలనాత్మక కుంభకోణంలా బయటికి రాబోతోందని జగన్‌ తెలిపారు.

తాను ఏపీకి ధర్మకర్తగా వ్యవహరిస్తా, వాస్తవాలు బయటపెడతానని ఆయన స్పష్టం చేశారు. తమ అభివృద్ధి నమూనా దేశానికే మార్గదర్శకంగా ఉంటుందని చెప్పారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా పనిచేస్తానని, వ్యవస్థను ప్రక్షాళన చేయడమే కాదని, పరిపాలన ఎలా సాగాలో చేసి చూపిస్తానని జగన్‌ అన్నారు. కుంభకోణాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించి ఆ సొమ్ముల్ని తిరిగి రాబట్టడమే కాదని, ఆ పనులన్నీ రద్దు చేసి ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. తక్కువ ఖర్చులకు పనిచేసేవారికే పనులు అప్పగిస్తామని, తన మీద ఉన్న కేసులన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని జగన్‌ తెలిపారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసులు లేవని, కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చాక కేసులు పెట్టారని జగన్‌ తెలిపారు.