కేంద్రం సంచలన నిర్ణయం.. పోలవరంపై తీవ్ర ఆందోళన

పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రప్రభుత్వంలో అలజడి రేగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో దీనికి నిధుల కేటాయింపులు జరగలేదని.. ప్రాజెక్టు పనులకు జరిగిన చెల్లింపుల్లో అక్రమాలు జరగలేదని నిపుణుల కమిటీ నివేదించేదానిని బట్టే భవిష్యత్‌లో నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికశాఖ జలశక్తిశాఖకు తేల్చిచెప్పిన వైనంపై ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేసింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జల వనరులశాఖ ఉన్నతాధికారులు రాజధాని నగరంలో అందుబాటులో లేకపోవడంతో వారితో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.‘ఆంధ్రజ్యోతి’ కథనం నిజమేనని ఆ శాఖ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా సత్వరమే నిధులు మంజూరు చేయాలని, తుది అంచనాలను తక్షణమే ఆమోదించాలని కోరుతూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ రాయాలని సీఎంవో నిర్ణయించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీని కలిసి ఈ నిధుల కోసం విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు తెలిసింది. నిజానికి ఈ ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు రూ.5,486 కోట్లు ఖర్చుపెట్టింది. అయితే ఇవ్వాల్సింది రూ.3వేల కోట్లేనని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఇందులో రూ.1,850 కోట్లను నాబార్డు ద్వారా రుణసాయం తీసుకుని విడుదల చేసేందుకు జలశక్తి శాఖకు అనుమతి ఇచ్చింది. ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ రాష్ట్రప్రభుత్వానికి కూడా తెలియజేసింది. దీంతో నిధులు త్వరలో వస్తాయని జగన్‌ ప్రభుత్వం ఎంతో ఆశపెట్టుకుంది.జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక, జలశక్తి అధికారులను కలిసి మిగతా 1,150 కోట్లు కూడా త్వరగా విడుదల చేయాలని అభ్యర్థించారు.

అంతలోనే ఆర్థికశాఖ ఈ నెల 8న జలశక్తి శాఖకు ‘ఆఫీసు మెమొరాండం’ పంపిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారంనాడు ‘పోలవరానికి బడ్జెట్‌ లేదు’ అన్న కథనాన్ని ప్రచురించింది. కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల్లేవని.. ఏ విధంగా సాయం అందించాలో త్వరలో స్పష్టత ఇస్తామని ఆ మెమొరాండంలో ఆర్థిక శాఖ తెలిపింది. సీఎంవో అధికారుల భేటీలో దీనిపై విస్తృత చర్చే జరిగింది.