పోలవరం ఆపేసి ఉమ్మడి ప్రాజెక్ట్ కడతారా..? అసలు స్కెచ్ అదే..!

అత్యంత వేగంగా పూర్తవుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ను… ఇలా.. మెల్లగా వివాదాల్లోకి లాగి.. .నిర్మాణాలు ఆగిపోయేలా… పీట ముడి వేస్తున్న పద్దతి చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అసలు ఎలాంటి అవకతవకలు జరిగినట్లు.. కానీ.. అవినీతి జరిగినట్లు కానీ నిర్ధారణ కాకుండానే.. కనీస ఆధారాలు లేకుండానే… ఏపీ సర్కార్ కాంట్రాక్టర్లకు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చింది. మధ్యలో పని ఆగిపోతే.. తర్వాత వేరే వారు వచ్చి.. ఎక్కువే డిమాండ్ చేస్తారు కానీ.. తక్కువకు చేయరనేది… ఏ చిన్న ఇల్లు కట్టిన వాళ్లకైనా ఉండే అనుభవం. అలాంటిది.. పోలవరం లాంటి ప్రాజెక్టులో మరి మరీ ఎక్కువ ఉంటుంది. అంతే.. కాదు.. అలాంటి ప్రాజెక్టును 70 శాతం పూర్తయిన తర్వాత ఇతరులు చేయి చేసుకుంటే.. నాణ్యతలోనూ… తేడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి.. ఏపీ సర్కార్… పోలవరం పనులు నిలిపివేయాలనే ఏకైక లక్ష్యంతోనే.. కాంట్రాక్టులకు టెర్మినేషన్ నోటీసులు ఇచ్చింది.

ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ.. ఏపీ ప్రభుత్వ చర్యను తప్పు పట్టింది. సమర్థవంతంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలను ఉన్నపళంగా తప్పించడం సరి కాదని.. పీపీఏ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రివర్స్ టెండరింగ్ వల్ల… ప్రాజెక్ట్ వ్యయం పెరగడంతో పాటు.. ఆలస్యం కూడా అవుతందని.. పీపీ ఏ సమావేశం అభిప్రాయపడింది. రివర్స్‌ టెండరింగ్‌ సరికాదని ఆ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందేనని.. పీపీఏ మొహమాటం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. కేవలం నిర్మాణ బాధ్యతుల మాత్రమే ఏపీ సర్కార్ పై ఉన్నాయి. ప్రతీ రూపాయి కేంద్రమే ఇస్తుంది. నిర్మాణ వ్యవహారాలను.. ఖర్చు పెట్టిన నిధులను రీఎంబర్స్ చేసుకోవాలన్నా… ప్రత్యేకంగా… ప్రాజెక్టుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా కచ్చితంగా… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అనుమతి ఉండాల్సిందే. లేకపోతే…. పనులు ముందుకు జరగవు. ఏపీ సర్కార్ మాత్రం… ముందస్తుగా… ఎలాంటి సమాచరం పీపీఏకు ఇవ్వకుండా.. నవయుగతో పాటు.. ఇతర కంపెనీలకు కాంట్రాక్ట్ టెర్మినేషన్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత నోట్ పంపింది. దీనిపై.. కేంద్రం ఇప్పటికే పలుమార్లు.. ఏపీ ప్రభుత్వానికి అసంతృప్తి తెలిపింది. వివరణలు కూడా అడిగింది. కేంద్రమంత్రి పార్లమెంట్ లో కూడా.. కాంట్రాక్టులను రద్దు చేయడాన్ని… దుంఖకరమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఇలా కేంద్రం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కార్… నిపుణుల కమిటీ ని నియమించి.. కాంట్రాక్ట్ కంపెనీలను పోలవరం పనుల నుంచి బయటకు పంపేసిందనే.. ఆరోపణలు కొద్ది రోజులుగా వస్తున్నాయి.

ఇప్పుడు బంతి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోనే ఉంది. పీపీఏ చెప్పినట్లుగా… రివర్స్ టెరిండరింగ్ ఆలోచన మానుకుని… కాంట్రాక్టు కంపెనీలకు ఇచ్చిన టెర్మినేషన్ నోటీసులను ఉపసంహరించుకుంటే…ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతుంది. లేకపోతే.. ప్రాజెక్ట్ నిర్మాణం పీటముడి పడిపోతుంది. రివర్స్ టెండరింగ్ కు.. కేంద్రం అంగీకరించకపోతే.. పనులు జరిగే అవకాశమే లేదు. అలా అని…కాంట్రాక్ట్ టెర్మినేషన్ నోటీసులను ఉపసంహరించుకునే తత్వం ఏపీ సీఎంది కాదు. ఈ విషయం పీపీఏల వ్యవహారంతోనే తేలిపోయింది. మరి ఇప్పుడు పోలవరం భవిష్యత్ ఏమిటన్నది కీలకంగా మారింది. తెలంగాణతో కలిసి చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టు కోసం.. పోలవరం ఊపిరి తీస్తున్నారనే.. అనుమానాలు ప్రజల్లో ప్రారంభమయ్యాయి.