పోలవరం అంశంలో జగన్ సర్కారుపై పిడుగు…!

అధికారంలోకి రావడమే రివర్స్ జపం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రివర్స్ పంచ్ పడింది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలు తప్పున్నర తప్పని ఇప్పుడు ఏకంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తేల్చి చెప్పింది. పనులు చక్కగా చేస్తున్న కంట్రాక్టు సంస్థలను తప్పించడం తప్పుబట్టడం సరికాదని తేల్చి చెప్పింది. కాంట్రాక్టు సంస్థలు ఎంతో సమర్ధవంతంగా పనులు చేశాయని వెనకేసుకువచ్చింది. ఈ ఊహించని శరాఘాతంతో వైసిపి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. సహజంగా భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు.. వాటి పనులు పూర్తి చేసిన సంస్థలు రెండేళ్ల నుంచి ఐదేళ్ల పాటు ఆనకట్ట భద్రతకు గ్యారెంటీ ఇస్తాయి. డ్యాంకు నష్టం వాటిల్లితే నిర్మాణ సంస్థలే బాధ్యత వహిస్తాయి. కానీ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థలను మారుస్తూ పోతే.. భవిష్యత్‌లో డ్యాం భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సూటిగా నిలదీసినట్లు సమాచారం. ఖ్వగాహన లోపంతో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి కీడే ఎక్కువ చేస్తాయని చెప్పకనే చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణం, గేట్ల బిగింపు వంటి అంశాలను వాణిజ్యపరమైన కోణంలో చూడలేమని హితవు పలికింది. కాంట్రాక్టు సంస్థకూ, కాంట్రాక్టు సంస్థకూ మధ్య నిర్మాణ విధానాల్లో మార్పుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని లిఖితపూర్వక సంజాయిషీ అడిగింది.

కాంట్రాక్టు సంస్థను మార్చడం వల్ల అంచనా వ్యయం పెరగదని.. లక్ష్యం మేరకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని హామీ పత్రం ఇవ్వగలరా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంచనాలు పెరగవని, సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే.. అప్పుడు మిగతా విషయాల గురించి ఆలోచిస్తామని కరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. పోలవరం పనులపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయంపై మంగళవారం హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో అథారిటీ సీఈవో ఆర్‌కే జైన్‌ అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు కూడా హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై పీపీఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థలను రద్దు చేసి కొత్త సంస్థలకు పనులు అప్పగించేలా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న ప్రీ-క్లోజర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుతుందని.. విపరీతమైన జాప్యం జరుగుతుందని.. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించింది.సమావేశం ప్రారంభమైన వెంటనే.. రివర్స్‌ టెండరింగ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని ఆర్‌కే జైన్‌.. ఆదిత్యనాథ్‌దాస్ ను ప్రశ్నించారు. ‘ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగదా? సకాలంలో నిర్మించడం సాధ్యమవుతుందా’ అని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు పోలవరం సాగునీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్కేంద్రం పనులను కలిపి ఒకే యూనిట్‌గా తీసుకుని రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయించామని దాస్‌ తెలిపారు. ప్రస్తుతం పనులు చేపడుతున్న నవయుగ, బెకమ్‌ సంస్థలకు అప్పగించిన ధరలనే ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌గా తీసుకుని.. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని.. దీనివల్ల ధరలు పెరగవని చెప్పారు. అప్పటివరకూ మౌనంగా ఉన్న జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు ఒక్కసారిగా ప్రశ్నలపరంపర కురిపించారు.ప్రాజెక్టుకు టెండర్లను పిలిచే అధికారం, రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నప్పుడు తమ వద్దకు ఎందుకు వచ్చారని నిలదీశారు. ‘కాంట్రాక్టు సంస్థలకు ప్రీ-క్లోజర్‌ నోటీసులు అందజేశాక.. మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరమేముంది? టెండర్లు రద్దు చేశాక మా వద్దకు వస్తారా? మీరే కొత్త టెండర్లను పిలిచి పనులు చేయించుకోవచ్చు కదా’ అని నిలదీశారు. కాంట్రాక్టు సంస్థను మార్చాలని నిర్ణయించుకోవడం ఇదే రెండోసారని ఆదిత్యనాథ్‌కు పీపీఏ గుర్తుచేసింది. గతంలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ సమర్థంగా పనిచేయడం లేదంటూ తప్పించారని జైన్‌ చెప్పారు. అప్పట్లో ట్రాన్‌స్ట్రాయ్‌ తరహాలోనే 14 శాతం మైన్‌సకు పనులు చేసేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ సంస్థను ఎందుకు మార్చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

‘నవయుగ, బెకమ్‌ చేసిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయా? నాణ్యతా ప్రమాణాలేమైనా లోపించాయా’ అని నిలదీసింది. ఇంతలో కేంద్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన సంస్థ నవయుగేనా అని ప్రశ్నించారు. ఔనని ఆదిత్యనాథ్‌ సమాధానం ఇచ్చారు. ‘ఈ పనుల్లో అక్రమాలు, అవినీతి జరిగాయా? నాడు ప్రాజెక్టు పనుల్లో ముఖ్య భూమిక వహిస్తోందంటూ ఆ సంస్థకు కితాబిచ్చి.. ఇప్పుడు అర్ధాంతరంగా తొలగించడం ఏమిటి? కారణాలేమీ చూపకుండా తొలగించడంలో అర్థమేమిటి’ అని ఉన్నతాధికారులు ప్రశ్నించారు. తమకు నవయుగ చేపడుతున్న కాంక్రీట్‌ పనులపైనా.. బెకమ్‌ తయారు చేస్తున్న గేట్లపైనా నమ్మకం ఉందని.. ఈ రెండు సంస్థల సామర్థ్యంపై విశ్వాసం ఉందని జైన్‌ తేల్చిచెప్పారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సమర్ధించు కోవడానికి అధికారులు ఇబ్బంది పడ్డారని సమాచారం.