ప‌లాస రాజ‌కీయంలో మ‌రో ఫైర్ బ్రాండ్

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీల్లో నాయ‌కులకు టికెట్ల కేటాయింపు చాలా ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న టీడీపీలో వార‌సుల విష‌యం తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే, వాస్త‌వానికి ఈ వారసులు త‌మ తండ్రుల‌ను, త‌ల్లుల‌ను అడ్డం పెట్టుకుని ఇప్ప‌టికిప్పుడు తెర‌మీదికి వ‌స్తున్న‌వారు ఎక్కువ‌గా మ‌న‌కు క‌నిపిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వ్యాపారాలు, వ్య‌వ‌హారాల్లో మునిగి తేలిన నాయ‌కులు ఇప్పుడు మాత్రం తాము ప్ర‌జాసేవ‌కు కంక‌ణ‌బ‌ద్ధులై ఉన్నామంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తండ్రులు, త‌ల్లులను అడ్డం పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు.

అయితే, అన్ని జిల్లాల్లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉందా? త‌ండ్రి, త‌ల్లి కొంగుల‌ను , చెంగుల‌ను క‌ప్పుకొని రాజ‌కీయాల‌లోకి వ‌చ్చే వారే ఉన్నారా? అంటే.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇలా లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది ఇలాంటి జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ప్ర‌ధ‌మ వ‌రుస‌లో నిలుస్తోంది. ఈ జిల్లాలోని ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం (గ‌తంలో సోంపేట‌) టీడీపీకి కంచుకోట‌. పార్టీ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌సారి మిన‌హాయిస్తే.. ఇక్క‌డ టీడీపీకి అండ‌గా ఉంటున్న కుటుంబం గౌతు ఫ్యామిలీ! స‌ర్దార్‌గౌతు ల‌చ్చ‌న్న వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన గౌతు శ్యామ్ సుంద‌ర్ శివాజీ 1993 నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. టీడీపీని ఇక్క‌డ ప‌రుగులు పెట్టించారు. అయితే, 2009లో మాత్రం ఒక్క‌సారి అప్ప‌టి వైఎస్ వేవ్‌లో ఓట‌మి చ‌విచూసినా.. పుంజుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఫ‌లితంగా ఇక్క‌డ టీడీపీ భారీ ఎత్తున పుంజుకుని 2014లో మ‌ళ్లీ చంద్ర‌బాబు వ్యూహాల మేర‌కు ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కారు శివాజీ. నిజానికి రాష్ట్రంలో ఈ ఫ్యామిలీ పేరు చెబితే చాలు.. వారి చ‌రిత్ర‌ను మొత్తంగా ఆక‌ళింపు చేసుకోవ‌డం తెలిసిందే. నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌ల‌కు ఈ ఫ్యామిలీ పెట్ట‌ని కోట‌. ఒక్క‌సారి ఎమ్మెల్యే పీఠం ఎక్కితే.. వంద‌ల కోట్ల అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న నాయ‌కులు ఉన్న ఈ రోజుల్లో.. ఈ రాజ‌కీయాల్లో.. కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్నా.. గౌతు ఫ్యామిలీ క‌నీసం ఒక్కటంటే ఒక్క‌టి అవినీతి ఆరోప‌ణ ఎదుర్కొన‌డం కానీ, ఒక్క‌రూపాయి ప్ర‌జాధ‌నం తిన‌డం కానీ ఎరిగిన పాపాన‌పోలేదు.

అందుకే నేటికీ స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న కుటుంబం అంటే.. ఏదైనా ఆరోప‌ణ చేసేందుకు కూడా విప‌క్షాలు భ‌య‌ప‌డే ప‌రిస్థితి మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇక‌, 2014 ఎన్నిక‌ల అనంత‌రం మంత్రి ప‌ద‌విని ఆశించారు శివాజీ. అయితే, స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో బాబు ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌లేక పోయినా.. ఆయ‌న మాట‌ల‌కు మాత్రం ఎప్పుడూ గౌర‌వం ఇస్తూనే ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి ఆశించిన దానికంటే కూడా ఎక్కువ‌గానే నిధులు ఇవ్వ‌డం, నియోజ‌క‌వర్గం అబివృద్ధి విష‌యంలో అన్ని విధాలా సాయం చేయ‌డం వంటివి మ‌నం చూశాం. అదే స‌మ‌యంలో శివాజీ కుమార్తె.. శిరీష కూడా తండ్రి వార‌స‌త్వంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆమె తండ్రి చాటు బిడ్డ‌గా ఉండ‌పోలేదు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌శించిన ఆమె త‌నదైన శైలిలో దూసుకుపోయారు. పార్టీనే ప్రాణంగా బావించే శిరీష‌.. పార్టీకోసం అహ‌ర‌హం శ్ర‌మించారు. త‌న తండ్రి శివాజీ గెలుపుకోసం ప్ర‌తి ఇంటికీ తిరిగి పార్టీని బ‌లోపేతం చేశారు. గ్రామ గ్రామానా ఆమె ముద్ర మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ముఖ్యంగా మ‌హిళా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆమె ముందున్నారు. దీంతో ఆమె సేవ‌ల‌ను గుర్తించిన చంద్ర‌బాబు కోర‌కుండానే ఆమెను జిల్లాటీడీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్పించారు. నిజానికి ఇంత పెద్ద బాధ్య‌త అప్ప‌గించ‌డం అనేది తండ్రి ఎంత స‌పోర్టు చేసినా ద‌క్కేది కాదు. స్వ‌యంగా ఆమె చేసిన కృషి ఫ‌లితంగా పార్టీలో ఆమె వేసిన ప్ర‌తి అడుగు అభివృద్ధి ప‌థంలో ప‌డిన కార‌ణంగా ద‌క్కిన అరుదైన గౌర‌వంగానే చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు.

ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో శిరీష్ త‌న తండ్రి స్థానం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. అయితే, ఇది బ‌లవంతంగా ఈ తండ్రీ కూతుళ్లు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై రుద్దుతున్న‌ది కాదు. ప్ర‌జ‌లే శిరీష నాయ‌క‌త్వాన్ని కోరుతున్నారు. ఇక జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ఆమె అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం, ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం, గ్రూపులు, వివాదాలు రాకుండా చూసుకోవ‌డం, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ అభివృద్ధికి కృషి చేయ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె ఎమ్మెల్యే అయితే బాగుండున‌నే వ్యాఖ్య‌లు పార్టీలోనూ వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా శిరీష్ కు టికెట్ ఇచ్చేందుకు రెడీగానే ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యంలో శివాజీ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే.. ఇక‌, శిరీష విజ‌యం ఖాయ‌మైన‌ట్టే అంటున్నారు ప‌రిశీల‌కులు.