పాదయాత్రలో ముద్దులు, అధికారంలో గుద్దులు.. జగన్ పై విరుచుకు పడ్డ చంద్రబాబు

ఏన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజలను ఎంత  దగ్గరకి తీసుకున్నాడు. ఇక అయన కౌగిలింతలు, ముద్దులు, అశిర్వాదాలు ఇప్పుడూ ఏం అయ్యాయి. అని ఏపీలో వున్న ప్రజలందరు ప్రశ్నిస్తున్నారు.ఎన్నికలకు ముందు వీధి వీధి తిరిగి ముద్దులు పెట్టిన సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు పిడిగుద్దుల పాలన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రశ్నించిన ప్రతివారినీ వేధిస్తూ, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహించారు. కర్నూలు జిల్లాలో మూడురోజుల పర్యటనలో భాగంగా స్థానికంగా ఓ ఫంక్షన్‌ హాల్లో సోమవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ నేతల వేధింపులకు తాళలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకొన్న ఈ జిల్లాలోని గాజులపల్లి గ్రామానికి చెందిన కొండారెడ్డి అనే టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ‘‘ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.

ఆ ప్రభుత్వాన్ని చూసుకుని మన కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని హెచ్చరించారు. దేవుళ్లు, దేవాలయాలు, స్కూళ్లు, చివరకు శ్మశానాలకూ రంగులద్దుకునే ఆ పార్టీ పిచ్చి పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం నుంచి వచ్చిన ఫర్నిచర్‌ను తీసుకెళ్లాలని లేఖ రాసినా ఉద్దేశపూర్వకంగా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై అక్రమ కేసులు నమోదు చేశారు. ఫర్నిచర్‌ కోసం ఇలా కేసులు పెడితే రూ.43వేల కోట్లు దోచుకున్న జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులకు ఇంకెన్నాళ్లు శిక్ష వేయాలి? సొంత బాబాయి హత్య కేసు నిందితుల్ని ఆర్నెల్లుగా పట్టుకోలేక… టీడీపీ అభిమానులపై సీఎం తన ప్రతాపం చూపిస్తున్నారు. ప్రశ్నించిన ప్రతి టీడీపీ కార్యకర్తలపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. గత ఐదేళ్లలో మనమూ ఇలా చేసుంటే ఇప్పటికి వైసీపీ అడ్రస్‌ ఉండేది కాదు’’ అన్నారు. ఇంకా ఆయన మాటల్లోనే..‘30 ఏళ్ల భవిష్యత్తు నాయకత్వాన్ని మీకందిస్తాను. టీడీపీ పనైపోయిందన్న వాళ్లకు సమాధానం చెబుతాను. తెలుగుజాతి ఉన్నంతకాలం టీడీపీ ఉంటుంది. భయపెట్టే కొద్దీ టీడీపీ బలపడుతుంది. కేసులు తవ్వుతామన్నారు, ఏది? ఎలుకను కాదు కదా! కనీసం తోకనూ పట్టుకోలేకపోయారు’’

‘ఏటా రైతులకు రూ.12,500 భరోసాగా ఇస్తామని హామీ ఇచ్చి రూ.7,500తోనే సరిపెడుతున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో వైసీపీ కార్యకర్తలకు మాత్రం నెలకు రూ.8వేల చొప్పున జీతాలిస్తున్నారు. రైతు రుణ మాఫీలో 4, 5 విడతల విడుదలకు అప్పటి సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్యణ్యం అడ్డుపడ్డారు. దీనిపై రైతులు కోర్టుకెళితే వారికి తప్పక న్యాయం జరుగుతుంది’’.‘‘టీటీడీ వెబ్‌సైట్లో అన్యమత పేర్లు వస్తే అది నా తప్పని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేం అధికారంలో ఉండగా మత సామరస్యాన్ని పాటించాం. ఎస్సీల మధ్య నేను చిచ్చు పెడుతున్నానని వైసీపీ నాయకుల అంటున్నారు. వారి మాటలు అవాస్తవం. ఎస్సీల ఏ,బీ,సీ,డీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను. స్థానిక ఎన్నికల్లో బడుగులకు ప్రాధాన్యమిస్తాం’’ అన్నారు.