ఒంగోలు టీడీపీలో కొత్త ట్విస్ట్…. సామాన్య కార్యకర్తగా వుంటానంటున్న సీనియర్ నేత

రాష్ట్రమంతా టీపీపీ టికెట్ల వ్యవహారం సజావుగా సాగిపోగా చివరి నిమిషంలో ప్రకాశం జిల్లాలో మాత్రం పీఠముడి పడింది. ఇక్కడి ఒంగోలు ఎంపీ, దర్శి, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో జరుగుతున్న పరిణామాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఆసక్తిని రేపుతున్నాయి. ఇక్కడి తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ సృష్టిస్తున్నాయి. ఒంగోలు లోక్‌సభ స్థానానికి మంత్రి శిద్దా రాఘవరావును రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకున్నప్పటికీ బుధవారం సాయంత్రం నుంచి సీన్ మారిపోయింది. అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. శిద్దాను లోక్‌సభకు పంపి దర్శి నుంచి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిల్లో ఒకరిని పోటీచేయాలని భావించారు. బుధవారం మధ్యాహ్నానికి దర్శి నుంచి ఉగ్ర నరసింహారెడ్డినే రంగంలోకి దించాలన్న ఆలోచనకు వచ్చి ఇటు ఉగ్రకు, అటు కదిరికి సీఎంను కలిసేందుకు రావాలని సమాచారం పంపారు.

అయితే ఇదే సమయంలో దర్శిలో టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద దర్శి నుంచి శిద్దానే పోటీ చేయించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కొందరు అభిమానులు వాటర్‌ ట్యాంకులు ఎక్కి హల్‌చల్‌ చేశారు. వారికి సర్దిచెప్పుకునేందుకు శిద్దా నానాయాతన పడ్డారు. చివరకు మీరు లోక్‌సభకు వెళ్తే మీ కుమారుడైన సుధీర్‌ను దర్శి నుంచి రంగంలోకి దించాలని పట్టుబట్టారు. ఇదేసమయంలో అమరావతిలో కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరిని కలిసిన మాజీ ఎమ్యెల్యే డాక్టర్‌ ఉగ్ర పార్టీలో సామాన్య కార్యకర్తగా అయినా ఉంటాను కానీ కనిగిరి మినహా ఇతర నియోజకవర్గాల నుంచి పోటీచేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. భేషరతుగా పార్టీలో చేరానని, కనిగిరిలో తన గెలుపునకు ఉన్న అవకాశాలను వివరించారనని, కుదరదు అనుకుంటే పార్టీకి సేవ చేస్తాను కాని దర్శికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. మంత్రి శిద్దా కానిపక్షంలో మీరు వచ్చినా ఇబ్బంది లేదంటూ దర్శి నుంచి కొందరు తెలుగుదేశం నేతలు తనకు ఫోన్లు చేశారని, అయినా తాను కనిగిరికే పరిమితమని చెప్పినట్లు తెలిసింది. అర్ధరాత్రి తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించి వంగవీటి రాధాను ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించి, మంత్రి శిద్దాను దర్శి అసెంబ్లీ నుంచే పోటీ చేయించే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు చెప్తున్నారు. కనిగిరిలో మీసర్వే ప్రకారం నేను ముందున్నానో, ఎమ్మెల్యే కదిరి ముందున్నారో గమనించి అవకాశం ఇవ్వాలని ఉగ్ర కోరారు. కనిగిరి నుంచి పోటీ చేస్తే తనకు ఉన్న గెలుపు అవకాశాలను సీఎంకు పూసగుచ్చినట్లు వివరించారని తెలిసింది. ఇదే సమయంలో సిటింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కూడా తాను కనిగిరిని వీడలేనని చెప్పినట్లు సమాచారం.

మరోవైపు మార్కాపురం టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. బుధవారం ఆ నియోజకవర్గం నుంచి 14మంది నాయకులు అమరావతికి చేరారు. వారితో ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య విడిడివిడిగా మాట్లాడారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా కందుల నారాయణరెడ్డే తగిన అభ్యర్థి అని సూచించారు. ఆ ఒకరిద్దరు మాత్రం కొన్నిఅంశాల్లో నారాయణరెడ్డికి మైనస్‌లు ఉన్నాయని, మరో దీటైన అభ్యర్థి ఎవరు అంటే తాము చెప్పలేమని, అధిష్ఠానమే చూడాలని చెప్పినట్లు తెలిసింది. ఆతర్వాత నియోజకవర్గం నుంచి వచ్చిన నేతలను పంపించి వేశారు. పొద్దుపోయిన తర్వాత కందులను పిలిపించుకొన్న సీఎం ఆయనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.