నిమిషం సమయంలో పెద్దాయన కష్టాన్ని తీర్చిన కేసిఆర్…

హైదరాబాద్‌ టోలీచౌకి ప్రాంతంలో రోడ్డుపై సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఆగింది. ఆ వెంటనే వెనక వస్తున్న కాన్వాయ్‌లోని మిగతా వాహనాలు కూడా ఆగిపోయాయి. ఏమైందేమోనని అధికారులు హైరానా పడ్డారు. ఇంతలో వాహనం దిగిన సీఎం కేసీఆర్‌.. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వృద్ధ దివ్యాంగుడి దగ్గరకు వెళ్లారు. ఏం పెద్దాయన.. చేతిలో వినతిపత్రం ఏంటంటూ ఆప్యాయంగా పలకరించారు. అనుకోని సంఘటనతో ఉబ్బితబ్బిబ్బైపోయాడా వృద్ధుడు. గురువారం మధ్యాహ్నం టోలిచౌకి నుంచి కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు వెళ్లే దారిలో ఉన్న తమ బంధువు ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి సీఎం కేసీఆర్‌ వెళ్తున్న సమయంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. తమ ప్రాంతానికి సీఎం వస్తుండటంతో ఆయనను చూడాలన్న తపనతో రోడ్డుకిరువైపులా జనం నిలబడ్డారు. ఆ జనంలోనే దివ్యాంగ వృద్ధుడు మహమ్మద్‌ సలీమ్‌ (60) కూడా ఉన్నాడు.

 

చేతిలో దరఖాస్తుతో సీఎం కాన్వాయ్‌వైపు చూస్తూ దణ్నం పెడుతూ కనిపించాడు.ఆ దృశ్యాన్ని చూసిన సీఎం కేసీఆర్‌ చలించిపోయారు. వెంటనే కారును ఆపించి దిగి సలీం దగ్గరకొచ్చి.. నీ సమస్యలు ఏంటంటూ కన్నబిడ్డలా ముచ్చటించారు. ఈ సందర్భంగా సలీం.. ‘నేను గతంలో డ్రైవర్‌గా పనిచేశా. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నా. నాలుగేళ్ల క్రితం భవనంపై నుంచి పడటంతో కాలు విరిగింది. నా కొడుకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఉండటానికి ఇళ్లు కూడా లేదు’ అని సీఎంతో మొరపెట్టుకున్నాడు. తనకు తగిన సాయం చేసి ఆదుకోవాలన్న సలీం విజ్ఞప్తిపై వెంటనే సీఎం కేసీఆర్‌ స్పందించారు. అతడి సమస్యలను పరిష్కరించాలని, దివ్యాంగుల పింఛన్‌, డబుల్‌ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు టోలిచౌకిలోని మోతీమహల్‌లో సలీం ఉంటున్న నివాసానికి కలెక్టర్‌ శ్వేతా మహంతి వెళ్లారు.

 

సదరమ్‌ పత్రం ఉండటంతో అప్పటికప్పుడు ఫిబ్రవరి నెల పింఛన్‌ రూ. 3016ను అందజేశారు. జియాగూడలో డబుల్‌ బెడ్రూం ఇల్లు కూడా మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స అందేలా చేస్తామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న సలీం కుమారుడికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్థిక సహాయం అందిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. కాగా, వృద్ధ దివ్యాంగుడిపై మానవత్వం చాటిన సీఎం కేసీఆర్‌కు కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

"
"