నాడు విమ‌ర్శించిన వాళ్లే నేడు లోకేష్‌ను పొగుడుతున్నారా..!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ సత్తా ఏంటో ఇప్పుడు కొంత మందికి తెలిసిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. తెలుగుదేశం పార్టీ ఓటమికి లోకేష్ కారణమని పార్టీలో ఉన్న వాళ్ళు, ప్రత్యర్ధులు కూడా ఆరోపిస్తూ ఉంటారు. మరి ఆయన ఏం చేసారో ఆయన వలన పార్టీ నష్టపోయింది ఏంటో వాళ్ళు ప్రజలకు చెప్పలేని పరిస్థితి. అసలు లోకేష్ ని వైసీపీ వాళ్లు ర‌క‌ర‌కాలుగా టార్గెట్ చేయ‌డానికి కారణం ఏంటో కూడా తెలియదు. ఎమ్మెల్సి గా ఆయన ఎలా ఎన్నికయ్యారు అనేది పక్కన పెడితే… మంత్రిగా ఆయన విజయం సాధించారు అనే విషయం అందరికి తెలుసు.

లోకేష్ తన శాఖలో సాధించిన విజయాలు… దేశంలో కూడా ఏ యువ మంత్రి సాధించలేదు. ఆయన శాఖకు వచ్చిన అవార్డులు కూడా దేశంలో ఏ శాఖకు రాలేదు. కొన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో లోకేష్ ఆలోచన విషయం ఉన్న వాళ్ళను ఆకట్టుకుంది. ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది. నాడు లోకేష్ చూసిన ఐటీ శాఖకు ఏ దిక్కు లేదు. చాలా మందికి ఆయన శాఖలో మంత్రి ఎవరో కూడా తెలియదు. రాజకీయంగా ఉత్సాహ భరిత ప్రసంగాలు లోకేష్ చేయలేకపోయారు ఏమో గాని పరిపాలన విషయంలో సీనియర్ మంత్రులు కూడా సాధించలేని విజయాలు సాధించారు.నాడు లోకేష్‌ను విమ‌ర్శించిన కొంద‌రు రాజ‌కీయ‌, మీడియా మేథావులు ఇప్పుడు ఈ రెండు ప్ర‌భుత్వాల్లో ఆ శాఖ‌ను కంపేరిజ‌న్ చేసుకుని లోకేష్‌ను మెచ్చుకుంటున్నారు. ఐటి శాఖలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది.

చాలా వరకు కంపెనీలు ఇక్కడి నుంచి సర్దుకోవడానికే చూస్తున్నాయి. ఆయన శాఖలో చెప్పుకోదగిన విజయం ఒక్కటి కూడా లేదు. ఆయన శాఖలో ఉన్న కొన్ని ఫైళ్ళు అలాగే పేరుకుపోయాయి. వాటి గురించి పట్టించుకునే నాధుడే లేడు. వాటి గురించి ఆరా తీసే అధికారి లేడు. మ‌రి ఈ టైంలో లోకేష్ స‌త్తా తెలియ‌క ఏం ? అవుతుంది.