అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన.. రెండు నెలల్లోనే అంతా సిద్దం

ఇవాళ బజారుకు వెళ్లి ఏ వస్తువు కొందామన్నా కల్తీయే ఉంటోందని, చివరకు పసి పిల్లలు తాగే పాలను కూడా దుర్మార్గులు కల్తీ చేస్తున్నారని, సింథటిక్‌ పాలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని, కారంలో రంపపు పొట్టు కలుపుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబయి మార్కెట్లో విజయ నెయ్యికి చాలా డిమాండ్‌ ఉందని, చివరకు విజయ పాల ఉత్పత్తులను కూడా దుర్మార్గులు కల్తీ చేయకుండా వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా బుధవారం సాయంత్రం ఆహార పదార్థాల కల్తీ, రైతు సమన్వయ సమితి, డీలర్ల ఖాళీల అంశాలపై ఆయన మాట్లాడారు.

కల్తీలేని పండ్లు, కూరగాయలు ప్రజలకు అందాలంటే ఒక నూతన వేదిక రావాలని ఆకాంక్షించారు. రేషన్‌ డీలర్లు, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డీలర్లకు కమీషన్‌ పెంచుతామని, రెండు, మూడు నెలల్లో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు.ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కల్తీ లేని స్వచ్ఛమైన ఆహార పదార్థాలు అందజేస్తామన్నారు. డీలర్ల వ్యవస్థను, మహిళా సంఘాలకు ఇచ్చే తయారీ యూనిట్లను ఏకీకృతం చేయాల్సి ఉందని చెప్పారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను తెస్తామని, ఆలూచిప్స్‌ తయారీ యూనిట్లను అందిస్తామని ప్రకటించారు. ఐకేపీ సిబ్బంది సేవలను కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉండటంతో పంటల దిగుబడి బాగా పెరిగే అవకాశం ఉందని సీఎం చెప్పారు. వ్యవసాయ విస్తరణ జరిగి, ఉత్పత్తి పెరిగిందే తప్ప ఉత్పాదకత ఇంకా పెరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు.ఉత్పాదకతను పెంచేందుకే దూరదృష్టితోనే రైతు సమన్వయ సమితులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

రాష్ట్ర రైతు సమన్వయ సమితికి త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని ప్రకటించారు. సమితుల అసలు పని ఇప్పటి నుంచే మొదలవుతుందని ప్రకటించారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి పనిచేస్తుందని చెప్పారు.

"
"