సండ్రకు షాకిచ్చిన టీడిపి ఎమ్మెల్యే…. అందుకే ఈ లేటు…!

టీడీపి నుంచి గెలిచిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. టిఆర్ఎస్ గెలిచిన నాటి నుంచి సండ్ర పార్టీ మరతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన్ని లాగేసుకునేందుకు టిఆర్ఎస్ కూడా భారీ తాయిలాలు ఆశ పెట్టినదని మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. దాదాపుగా సండ్ర పార్టీ మారడం ఖాయమని ముహూర్తం ఫిక్స్ అయ్యిందని అనుకుంటున్న తరుణంలో ఆయన జంపింగ్ కు టీడిపి ఎమ్యెల్యేనె బ్రేకు వేశారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఏక‌ప‌క్షంగా ప్రజ‌లు అధికారం క‌ట్టబెట్టారు. అయినప్పటికీ గులాబీ పార్టీ నేత‌లు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీశారు. ఇప్పటికే ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఇంత‌టితో ఆగ‌కుండా కాంగ్రెస్ శాస‌న‌మండ‌లి ప‌క్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. దీంతో శాస‌న‌మండలిలో ప్రతిప‌క్షం అనేదే లేకుండా పోయింది.

మొన్నటి ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కొన‌సాగినా.. ఖ‌మ్మంజిల్లాలో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇక్కడ అధికారపార్టీకి ఒకేఒక్క సీటు దక్కింది. దీంతో ఈ జిల్లానుంచి గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల‌పై టీఆర్ఎస్ నేత‌ల దృష్టిప‌డింది. స‌త్తుప‌ల్లి నుంచి గెలిచిన సండ్ర వెంక‌టవీర‌య్యతో ఖ‌మ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కీల‌క నేతలు ఇప్పటికే చ‌ర్చలు జ‌రిపారు. పార్టీ మారితే మంత్రి ప‌దవి కూడా ఇస్తామ‌ని సండ్రకు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా వార్తలొచ్చాయి. కేసీఆర్ సైతం సండ్రతో మాట్లాడిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే అశ్వరావుపేట నుంచి గెలిచిన మ‌రో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును కూడా టీఆర్ఎస్‌లోకి తీసుకురావాల‌ని సండ్రకు కండీష‌న్ పెట్టిన‌ట్లు వినికిడి. దీనితో మెచ్చా నాగేశ్వరరావుతో సండ్ర స‌మావేశ‌య్యారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో పార్టీ మారితేనే మంచిద‌నీ.. భవిష్యత్‌ కూడా ఉంటుంద‌నీ నాగేశ్వరరావుతో సండ్ర చెప్పిన‌ట్లు స‌మాచారం. అయితే తాను నిర్ణయం తీసుకోవ‌డానికి కొంత స‌మ‌యం కావాల‌ని సండ్రతో అశ్వరావుపేట ఎమ్మెల్యే చెప్పారట. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ లోపుగానే వీలైనంత మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందువల్ల త్వర‌గా నిర్ణయం తీసుకోవాల‌ని నాగేశ్వరరావుపై సండ్ర వత్తిడి తెస్తున్నట్లు స‌మాచారం. దీనికి కూడా ఓ కారణం ఉందట. క్యాబినెట్ విస్తర‌ణ త‌ర్వాత పార్టీ మారితే ప్రయోజ‌నం ఉండ‌ద‌ని సండ్ర భావిస్తున్నారట.

క్యాబినెట్ కూర్పు లోపలే పార్టీ మారాలని సండ్ర నిర్ణయించుకున్నట్లు ఆయన వర్గీయులు కొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో సండ్ర వెంక‌టవీర‌య్య ఏ- 2గా ఉన్నారు. పార్టీ మారే విష‌యంలో ఆల‌స్యమైతే ఎక్కడ ఆ కేసు మళ్లీ తెర‌పైకి వ‌స్తుందోనని సండ్ర ఆందోళన చెందుతున్నట్టు సమాచారం! పైకి మాత్రం పార్టీ మార‌ను అని సండ్ర చెబుతున్నప్పటికీ సంక్రాంతి లోపలే ఆయ‌న గులాబీ కండువా క‌ప్పుకుంటార‌ని రాజకీయవర్గాల భోగట్టా. పార్టీ మార‌డ‌మే కాకుండా టీఆర్ఎస్‌లో టీడీఎల్పీని విలీనం చేయ‌నున్నట్లుగా లేఖ‌ను ఇచ్చేందుకు సండ్ర సిద్ధమ‌వుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.